మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్… ఆస్తుల చిట్టా బయటపెట్టిన ఏసీబీ

ఇరిగేషన్‌ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇరిగేషన్‌ శాఖలో అక్రమాలపైఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మురళీధర్‌రావుకు చెందిన బ్యాంక్‌ లాకర్లు తెరవనున్నారు. లాకర్లలోని బంగారం లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్.. ఈఈ నూనె శ్రీధర్‌ను అరెస్ట్‌ చేసిన ఏసీబీ… లేటెస్ట్‌గా మరో మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావును అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు ఆయన కొడుకు ఇళ్లు, కంపెనీల్లోనూ సోదాలు ముమ్మరం చేసింది.

కాగా, మురళీధర్‌రావు ఆస్తుల చిట్టా బయటపెట్టింది ఏసీబీ. కోటి రూపాయల చిట్స్‌.. రూ.60లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్లు గుర్తించింది. రూ.10లక్షల విలువైన గోల్డ్‌.. రెండు ఖరీదైన కార్లు.. రెండు బైక్స్‌ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గోపాల్‌పూర్‌లో 3.39 ఎకరాల భూమి, కీసరలో 30 గుంటల భూమి.. రాచకొండలో 300 గజాల ప్లాట్‌ ఉన్నాయి. ఒక్క కరీంనగర్‌లోనే ఆరు ఖరీదైన ఓపెన్‌ ప్లాట్స్‌ గుర్తించింది ఏసీబీ. ఘట్‌కేసర్‌లో 300 గజాల ప్లాట్‌.. హయత్‌నగర్‌లో 1201 గజాల ప్లాట్‌, హయత్‌నగర్‌లోనే మరోచోట 1050 గజాల ప్లాట్‌, వరంగల్‌ శాయంపేటలో 234 గుంటల భూమి.. హన్మకొండలో 303 గజాల ప్లాట్‌, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో 10 గుంటల భూమి.. 60 గజాల ప్లాట్‌ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్‌రావు… నిధులను తన కుమారుడు అభిషేక్‌రావు సొంత కంపెనీకి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కాళేశ్వరంతోపాటు పాలమూరులోనూ భారీగా సబ్‌ కాంట్రాక్ట్‌లు తీసుకున్న ఆయన… తన కుమారుడి బినామీలకు లబ్ధిచేకూరేలా వ్యవహరించినట్లు తేల్చారు. వర్క్‌ ఆర్డర్స్‌ జారీలోనూ అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడించారు. అలాగే హర్ష కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం నిధులను హర్ష కన్‌స్ట్రక్షన్‌కి అభిషేక్‌రావు వాడుకున్నట్లు భావిస్తున్నారు అధికారులు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ENCగా ఉన్న మురళీధర్‌రావు… గతేడాది ఫిబ్రవరిలోనే రాజీనామా చేశారు. ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా పనిచేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన విచారణనూ ఎదుర్కొన్నారు. నాడు ENCగా ఆయన చక్రం తిప్పారని, భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ… మురళీధర్‌రావుకు చెందిన 10 చోట్ల సోదాలు చేస్తోంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *