శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ – అక్కడ ప్రయాణం పూర్తి ఉచితం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల అరికట్టడం, కాలుష్య నియంత్రణకు ఉచిత బస్సులు చారిత్రకమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు శ్రీవారి ధర్మ రథాల మార్గంలో ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ద్వారా తిరుమలలో భక్తుల రవాణా మరింత సౌకర్యవంతం కానుంది.

తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ఉచిత స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుండి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వ‌రిత‌గ‌తిన బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావ‌డంతో కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు తిరిగే మార్గంలోనే ఈ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని చెప్పారు.

ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు, ఆర్టీసీకి అద‌న‌పు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ 300 ట్రిప్పుల‌ను తిప్పుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వ‌డంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతమవ్వ‌డంతో పాటు బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు.

భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బ‌స్సులను ఎక్క‌డం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ఏ ప్రాంతంలో బ‌స్సు ఎక్కినా తిరుమ‌ల నుంచి తిరుప‌తికి మాత్ర‌మే ఛార్జీలు ఉంటాయ‌ని, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని ఆయ‌న భ‌క్తుల‌ను కోరారు. అంటే తిరుమలలో మీరు ఒక ప్రాంతం నుంచి మరోొ ప్రాంతానికి ఆర్టీసీ బస్సుల్లో సైతం ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే తిరుమల నుంచి తిరుపతికి లేదా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తే చార్జీలు ఉంటాయి.

About Kadam

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *