ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్‌లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనంతోపాటు వసతి సౌకర్యం, అలాగే స్టడీ మెటీరియల్, బోధనా సిబ్బందిని సైతం నారాయణ విద్యాసంస్థలు ఉచితంగా అందిస్తాయని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు ముందుకొచ్చిన మంత్రి నారాయణకు డోలా బాల వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ పీజీఈసెట్ 2025కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. చివరి తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో గేట్/జీప్యాట్/ఏపీపీజీఈసెట్ 2025 ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. మొదటి దశ ప్రవేశాలకు జులై 8న నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు జులై 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.