నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు..
ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల విస్తరించి ఉంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించారు. చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రాగల 4 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.