జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ జరిగింది. అమెరికా తన మిత్రదేశాలకు రష్యన్ చమురు దిగుమతిని నిరోధించడానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం అందించడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అంశం కూడా చర్చించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో తన మిత్ర దేశాలకు అమెరికా ఒక కీలక పిలుపు ఇచ్చింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏడు దేశాల ఆర్థిక మంత్రులు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రొత్సహించేందుకు సహాయపడుతున్న దేశాలపై సుంకాలు విధించే అంశంపై తీవ్రంగా చర్చించారు. రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించాలని అమెరికా సమావేశంలో మిగిలిన దేశాలకు పిలుపునిచ్చింది.
ఈ G7 సమావేశానికి కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్ అధ్యక్షత వహించారని రోలింగ్ G7 ప్రెసిడెన్సీ అధిపతి కెనడా నుండి ఒక ప్రకటనతో తెలిపారు. ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చడానికి స్తంభింపచేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే చర్చలను వేగవంతం చేయడానికి మంత్రులు అంగీకరించారు. రష్యాపై ఒత్తిడిని పెంచడానికి విస్తృత శ్రేణి ఆర్థిక చర్యలను చర్చించారు, రష్యా యుద్ధ ప్రయత్నాలకు వీలు కల్పించే వాటిపై మరిన్ని ఆంక్షలు, సుంకాలు వంటి వాణిజ్య చర్యలు తీసుకోవడం చర్చ జరిగింది.
రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడంలో అమెరికాతో చేరాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆర్థిక మంత్రులతో పిలుపునిచ్చారని బెసెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ సమావేశం తరువాత ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముందు రోజు US ట్రెజరీ ప్రతినిధి G7, యూరోపియన్ యూనియన్ మిత్రదేశాలకు చైనా, భారత్ నుండి వచ్చే వస్తువులపై సుంకాలు విధించాలని పిలుపునిచ్చారు. తద్వారా రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒత్తిడి తేవచ్చని తెలిపారు.