ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపం వద్ద జరిగిన వేలం పాటలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. శుక్రవారం నిమజ్జనానికి ముందు లడ్డూ, కలశం కోసం ప్రత్యేకంగా వేలం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్‌రెడ్డి లడ్డూను భారీ ధరకు దక్కించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండగ రోజున గణపతిని ఆరాధించిన తర్వాత, కొన్ని రోజులు గడిచాక నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయి. ఈ సందర్భంలో వినాయకుడి ప్రసాదంగా ఉంచిన లడ్డూలకు జరిగే వేలంపాటలు ప్రత్యేక ఆకర్షణగా మారుతుంటాయి. హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ దేశవ్యాప్తంగా పేరుగాంచినా, ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూలు, కలశాలు వేలం పాటల్లో భారీ ధర పలుకుతున్నాయి.
తాజాగా ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లి గ్రామంలో గణపతి లడ్డూ దక్కించుకునేందుకు భారీ పోటీ నడిచింది. అక్కడి గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ, కలశానికి శుక్రవారం నిమజ్జనం ముందు వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పాలుగుళ్ల మోహన్‌రెడ్డి లడ్డూని ఏకంగా రూ.30 లక్షలకు కైవసం చేసుకున్నారు. మోహన్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. అదే విధంగా మండపంలో ఉన్న కలశాన్ని మరో గ్రామస్థుడు ముత్యాల నారాయణరెడ్డి రూ.19.10 లక్షలకు పొందారు. ఆయన కూడా బెంగళూరులో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. దీంతో ఒకే రోజు లడ్డూ, కలశం కలిపి మొత్తం రూ.49.10 లక్షలు పలికాయి. ఇది ఈ గ్రామంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ధరగా చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ మండపంలో లడ్డూ, కలశం వేలం పాట సంప్రదాయంగా నిర్వహిస్తారు. వేలం ద్వారా వచ్చిన మొత్తం నిధులను గ్రామ అభివృద్ధి పనులకు, ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఒక చిన్న పల్లెటూరిలో లడ్డూ, కలశం కలిపి దాదాపు 50 లక్షల వరకు రికార్డు ధర పలకడం ప్రస్తుతం ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.