దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గణపయ్య జన్మదినోత్సవం వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజున గల్లీ గల్లీ మండపాలు ఏర్పాటు చేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టించి గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు పండళ్లను సందర్శిస్తారు. గణపతి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా గణపతి విగ్రహాలు గంగమ్మ ఒడిలో చేరే వరకూ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. మండపాలలో గణపతి విగ్రహాలను రకరకాల రూపాల్లో ప్రతిష్టించారు. అయితే కొన్ని విగ్రహాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వాటికీ సంబంధించిన వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
అలాంటి గణపతి విగ్రహం సామూహిక విశ్వాసం, కళాత్మక నైపుణ్యం, భక్తుల శక్తివంతమైన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఒడిశాలోని సంబల్పూర్ నటరాజ్ క్లబ్ సభ్యులు ఆపిల్స్ తో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ విగ్రహం భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది. గణేష్ విగ్రహం తయారీ కోసం మొత్తం 1500 కేజీలను ఉపయోగించారు. ఈ ఆపిల్స్ ను విగ్రహం నిమజ్జనం తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచి పెడతామని నటరాజ్ క్లబ్ సభ్యుడు నిర్మల్ రతి చెప్పారు.
తెలంగాణలో జగిత్యాలలో ఒక మండపంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం కూడా ఆకట్టుకుంది. వినాయకుడిని ఊయలలో వేసి గరుడుడు ఆ ఊయలను ఊపుతున్నాడు.
హైదరాబాద్ లో కూడా గణేష్ ఉత్పవాలు వైభవంగా సాగుతున్నాయి. గల్లీ గల్లీ లో మండపాలలో కొలువుదీరిన గణపయ్య భక్తులతో పూజలను అందుకున్నాడు. ఈ ఏడాది ఒక మండపంలో వినాయకుడి విగ్రహాన్ని ఆపరేషన్ సిందూర్ నేపధ్యంలో తో తయారు చేశారు.
తిరుపతిలో కొబ్బరికాయలతో తయారు చేసిన విగ్రహం కూడా ఆకట్టుకుంది. 1500 టెంకాయలతో వినయకుణ్డిని యువత తయారు చేసి మండపంలో ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి తయారు మొదలు పెట్టారు. యుకులు స్వయంగా స్వహస్తాలతో గణపతి విగ్రహం చేయడం విశేషం.