అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల గోల్డ్ లోన్ మోసాలు కలకలం రేపుతున్నాయి. జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. రాంనగర్‌లోని ఓ బ్యాంకులో పనిచేసే వెంకటపల్లి సతీష్‌కుమార్.. పాత ఉద్యోగి జయరాములుతో కలిసి గోల్డ్ లోన్ మోసాలు చేశారు. బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తులు తాకట్టు పెట్టిన బంగారాన్ని.. ఆ బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా సుమారు రెండు కేజీల గోల్డ్‌ను చోరీ చేయడం సంచలన సృష్టించింది. కొందరు కస్టమర్లు బ్యాంకులో గోల్డ్ తనఖా పెట్టి లోన్లు తీసుకోగా.. ఆ గోల్డ్‌ను తీసుకెళ్లి మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తెచ్చుకున్నారు కొందరు వ్యక్తులు.
ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగి సతీష్‌కుమార్ ప్రధాన నిందితుడు కాగా.. మరో నలుగురు వ్యక్తులు అతని సహకరించారు. అందరూ కలిసి పనిచేస్తున్న బ్యాంకును బురిడీ కొట్టించారు. అయితే.. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో లేకపోవడంతో గోల్డ్ లోన్ ఆఫీసర్ సతీష్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టు అయింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన కస్టమర్లకు ఫోన్లు చేసి.. రెన్యువల్ చేసుకోవాలని పిలిపించిన నిందితులు..
రెన్యువల్ ఫామ్‌లపై సంతకాలు చేయించకుండా.. విత్‌డ్రా ఫామ్‌లపై సంతకాలు చేయించి మోసాలు చేశారని తెలిపారు అనంతపురం పోలీసులు. ఈ విధంగా గోల్డ్‌ను విత్ డ్రా చేసుకుని.. కీర్తన ఫైనాన్స్‌లో తనఖా పెడుతున్నారని వెల్లడించారు. టెక్నికల్ ఆధారాలతో కేసును చేధించిన పోలీసులు.. 50గ్రాముల బంగారంతోపాటు నాలుగు ఫోన్లు సీజ్ చేశారు. నిందితుల్లో A2 330 గ్రాములు, A3 కిలో 200గ్రాములు, A4 650 గ్రాముల బంగారం చోరీ చేసి.. కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు తేలిందన్నారు అనంతపురం పోలీసులు.