గణపతి విగ్రహంతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారం నిమజ్జనం.. కట్ చేస్తే..

హైదరాబాద్ శివారులో వినాయక నిమజ్జనం సందర్భంగా గిరిజ కుటుంబం ఐదు తులాల బంగారాన్ని విగ్రహంతో పాటు చెరువులో నిమజ్జనం చేయడంతో కలకలం రేగింది. నిమజ్జనం తర్వాత వారికి బంగారం విషయం గుర్తుకువచ్చింది..? ఆ తర్వాత వారు ఏం చేశారు..? బంగారం తిరిగి వారి చేతుల్లోకి వచ్చిందా..?

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు వినాయక నవరాత్రి సందడితో కళకళలాడిపోతున్నాయి. ఊరూరా మండపాలు వెలసి.. గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్‌ శివారులోని తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్‌ చెరువు వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది

హస్తినాపురానికి చెందిన గిరిజ కుటుంబం తమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చెరువు వద్దకు చేరుకుంది. పూజలు చేసి, భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని నీటిలో వదిలారు. పోయిరా గణపతి అంటూ… ఏకదంతుడికి టాటా చెప్పారు. కానీ కొద్ది సేపటికే వారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే విగ్రహానికి అలంకరించిన ఐదు తులాల బంగారు నగలు తీసేయడం మర్చిపోయి అలానే నిమజ్జనం చేశారు. దీంతో తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో అర్థంకాక ఈ విషయాన్ని వారు మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. చెరువులో అనేక విగ్రహాలు ఉన్నా, ప్రత్యేక యంత్రాల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత చివరికి ఆ విగ్రహాన్ని గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. పరిశీలించగా బంగారు ఆభరణం సురక్షితంగా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు వాటిని గిరిజ కుటుంబానికి తిరిగి అందజేశారు. తమ సంపద తిరిగి అందడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

About Kadam

Check Also

సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌.. సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *