ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, అంకురార్పణ, ద్వార తోరణం ధ్వజ కుంభారాధన, అంకురార్పణ హోమం జరుగుతుంది. హోమాలు, జపాలు, హవనాలు, వేదాలు, పారాయణాలతో పాంచనారసివుడి ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టి పడుతోంది. మరో నాలుగు రోజుల పాటు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో పంచకుండాత్మక యాగం జరుగుతుంది.
దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నిలువనుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ‘విమాన గోపురం’ బంగారు పూతను ఆవిష్కరించడానికి ఐదు రోజుల ‘ కుంభాభిషేకం ‘, ప్రతిష్టాపన ఉత్సవం బుధవారం ప్రారంభమైంది. పూర్తయిన తర్వాత, యాదగిరిగుట్ట ఆలయం దేశంలోనే ఎత్తైన బంగారు పూతతో కూడిన విమాన గోపురం అవుతుంది. ఇది టిటిడి 33 అడుగుల నిర్మాణంతో పోలిస్తే 55 అడుగుల ఎత్తు ఉంటుంది. కాగా ఈ నెల 23న ఉదయం 11.54 గంటలకు 108 కలశాలతో సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించనున్నారు.
ఈ సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు హాజరుకానున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. రాబోయే MLC ఎన్నికల దృష్ట్యా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అనుమతి కోరుతూ ఆలయ పరిపాలన విభాగం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. స్వర్ణమయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పంచతల విమాన గోపురం బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు ఆకర్షణీయంగా కనువిందు చేయనుంది. దాదాపు రూ. 70 కోట్ల వ్యయంతో జరిగిన బంగారు పూత పనిలో దాదాపు 66 కిలోల బంగారం ఉపయోగించినట్లు తెలిసింది.