సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ గూగుల్..1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి సైతం విశాఖ వేదిక కానుంది..
ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు వైజాగ్‌లోనూ అడుగుపెట్టనుంది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి సైతం విశాఖ వేదిక కానుంది. ఈ మేరకు గూగుల్‌కు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో వెల్లడించింది. గూగుల్ ప్రతిపాదన గేమ్ ఛేంజర్ కానుంది. ప్రపంచానికి డిజిటల్ హబ్‌గా దేశానికి గుర్తింపు వస్తుందని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక, సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా తన ప్రకటనలో పేర్కొంది. ఇన్వెస్ట్ ఇండియా ప్రకటనలో ఇప్పుడు యావత్ ప్రపంచం ఫోకస్ ఏపీపై నిలిచింది. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ వర్క్‌ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
విశాఖలో త్వరలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్.. దేశానికి చెందిన మొత్తం డేటా నిల్వ చేయనుంది. దీనివల్ల ఉగ్రమూక చేతిలోకి విలువైన డేటా చేరే అవకాశం తప్పుతుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచేందుకు 3 సబ్ మెరైన్ కేబుల్స్‌కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి డేటా సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ముంబయిలో గూగుల్‌కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం సులువు అవుతుంది. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్దఎత్తున నీరు అవసరం అవుతుంది. అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది.
పైగా ఐటీ రంగంలో రూ.2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది నిరుద్యోగులకు దశలవారీగా ప్రత్యక్ష ఉపాధి అవకాశం లభించనుంది. ఇక పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభించనుంది. అంతేకాకుండా డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలని గూగుల్ నిర్ణయించింది. ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.20 వేల కోట్లు గూగుల్ ఖర్చు చేయనుంది. సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, వాటి ద్వారా వచ్చే విద్యుత్‌ను గూగుల్ వినియోగించుకోనుంది.