పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా ‘హరి హర వీరమల్లు’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలై మూడురోజుల్లా కాకముందే Ibomma, Movierulz లాంటి వెబ్‌సైట్లలో లీక్ కావడంతో తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. అభిమానులతో పాటు సినీప్రేక్షకులూ ఆసక్తిగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎగబడ్డారు. అయితే.. రిలీజ్ అయ్యి మూడురోజుల్లా కాకముందే ఈ సినిమా పైరేటెడ్ వెర్షన్ కొన్ని వెబ్‌సైట్లలో కనిపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పైరసీ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన.. Ibomma, Movierulz వంటి సైట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాను వీటి ద్వారా అక్రమంగా అప్‌లోడ్ చేసి ప్రజలకు చూపిస్తున్నారని పేర్కొంటూ.. తక్షణమే చర్యలు చేపట్టి సినిమాను తొలగించాలని తిరుపతి అర్బన్ డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు.