బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, మరియు గోదావరి జిల్లాలపై పడింది. జూలై 24 వరకు ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అటు తెలంగాణలో ఈనెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉదయం 6 నుంచే పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
మరోవైపు ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మైలవరంలో వాగులూ, వంకలూ ప్రవాహిస్తున్నాయి. మైలవరంలోని సూరిబాబు పేట, బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కొండవాగు ఉదృతి పెరగడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రథాన రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో 22.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. యాకన్నగూడెం దగ్గర తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య హైవేపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
Amaravati News Navyandhra First Digital News Portal