తెలంగాణలో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను చూపిస్తూ, ఖైరతాబాద్ RTO వేలంలో రూ.63,77,361 ఆదాయం సమకూరింది. హెటెరో డ్రగ్స్ రూ.25,50,200 చెల్లించి TG09J 9999 నంబర్‌ను దక్కించుకుంది. ఇతర సంస్థలు, వ్యక్తులు కూడా లక్షల్లో ఖర్చు చేసి ప్రత్యేక నంబర్లను కొనుగోలు చేశారు.
వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. కొంతమంది లక్కీ నంబర్ల కోసం, మరి కొంతమంది సీరియల్ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు. లక్షలు పెట్టి కొన్న తమ వాహనానికి అంతే స్పెషల్ నంబర్ ఉండాలని అనుకుంటారు. వాహనదారుల్లో ఉండే ఈ క్రేజ్‌ను ప్రభుత్వం క్యాష్ చేసుకుంటుంది కూడా. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 12న ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలం నిర్వహించారు.
ఈ వేలంలో చాలా మంది పోటాపోటీగా పాల్గొన్నారు. ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ల అమ్మకం ద్వారా వేలం పాటలో ఒక్క రోజులోనే మొత్తం రూ.63,77,361 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ ప్రకటించారు. జనాల్లో ఈ ఫ్యాన్సీ నంబర్ అంటే ఎంత పిచ్చి ఉందో ఈ ఆదాయం చూసి చెప్పొచ్చు.
హెటిరో డ్రగ్స్.. రికార్డు బిడ్
ఈ వేలంలో అగ్రస్థానంలో ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటెరో డ్రగ్స్ నిలిచింది, రూ.25,50,200 రికార్డు బిడ్ చెల్లించి TG09J 9999 నంబర్‌ను కైవసం చేసుకుంది. ఈ సెషన్‌లో ఫ్యాన్సీ నంబర్‌కు చెల్లించిన అత్యధిక మొత్తం ఇదే. ప్రీమియం రిజిస్ట్రేషన్ ప్లేట్‌లకు ఉన్న బలమైన డిమాండ్‌ను ఈ బిడ్ తెలియజేస్తుంది. ఇతర నంబర్లు కూడా అద్భుతమైన మొత్తాలను పొందాయి. TG09J9990 నంబర్‌ను మీర్ అశ్వాక్ జహీర్ రూ.1.22 లక్షలకు కొనుగోలు చేయగా, ARL టైర్స్ రూ.6,50,009 చెల్లించి TG09H0009ను పొందింది. డాక్టర్ రాజేశ్వరి స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ రూ.6,25,999కు TG09J0001ను కొనుగోలు చేసింది. AMR ఇండియా రూ.5,11,666కు TG09J0006ను కొనుగోలు చేసింది.