ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల నూనెపల్లెకు చెందిన పెయింటర్ రమణ అనుమానాస్పద మృతి పట్టణంలో కలకలం రేపింది. మృతుడు రమణకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రమణమ్మతో ఇరవై సంవత్సరాల క్రితం వివాహం అయింది. రమణ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లకు జ్యోతి, చందన, సాయి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఈ నేపధ్యంలో పెయింటింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న రమణకు వివాహేతర సంబంధం ఉందంటూ తరచూ భార్యభర్తల మధ్య ఘర్షణ జరగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒక నెల క్రితం రమణమ్మ.. రమణతో ఘర్షణ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు నచ్చచెప్పినా రమణమ్మ నంద్యాలకు రాలేదు. ఈ క్రమంలో రమణ రెండు రోజుల క్రితం భార్య రమణమ్మ నంద్యాలకు పిలుచుకుని రావడానికి పిడుగురాళ్ల పట్డణానికి వెళ్లాడు.
అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం తెల్లవారుజామున రమణ మృతదేహాన్ని ఓక కారులో భార్య రమణమ్మ, అమె తమ్ముడు రామయ్య తీసుకొచ్చి మంచంపై పండుకోబెట్టి.. తిరిగి కారులో వెళ్లిపోయారు. తండ్రి నిర్జీవంగా పడిపోవడం చూసి.. చిన్న కూతురు చందన అనుమానంతో తల్లిని నిలదీసింది. తల్లి రమణమ్మ పొంతనలేని సమాధానం ఇవ్వడం.. తండ్రి మృతదేహాంపై గాయాలతో పాటు కారంపొడి చల్లిన ఆనవాళ్లు ఉండటం గమనించింది.
తండ్రి అనుమానాస్పద మృతిపై చందన, అక్క జ్యోతికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలిసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కూతురు చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal