హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులను వేధించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు చివరికి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ సినీ సెలబ్రిటీలను భయపెట్టడం, వారి ఇళ్లకు వెళ్లి వేధించడం, పెద్ద ఎత్తున బెదిరింపులు గురిచేయడం వంటి పనులతో.. కలకలం రేపిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడి వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు, తన హోదాను మించిపోయి ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకుంటూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన వాట్సాప్ డీపీ, స్టేటస్‌లలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అని పేర్కొంటూ తాను ఉన్నతాధికారిననే భావన కలిగించేవాడు. అలా ప్రముఖులను వేధింపులకు గురిచేశాడు. టాలీవుడ్‌లో అప్పుడప్పుడు డ్రగ్స్ కేసులు పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. సినీ ప్రముఖుల ఇళ్లలో అకస్మాత్తుగా వెళ్లి తనే అధికారినని చెప్పి తనిఖీలు జరిపేవాడు. ఇంట్లో డ్రగ్స్ దొరికితే కేసులో ఇరికిస్తాను అని బెదిరించి వారిని మానసికంగా వేధించేవాడు. ఆపై వారి నుంచి డబ్బు దండుకునేందుకు కుట్ర పన్నాడు.
ఇటీవల కాలంలో ఉమామహేశ్వరరావు బెదిరింపులు మరింత ఎక్కువవ్వడంతో.. కొందరు బాధితులు ధైర్యం చేసి నగర పోలీసులను సంప్రదించారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, గోప్యంగా సమాచారం సేకరించారు. ప్రాథమిక విచారణలోనే ఉమామహేశ్వరరావు చేస్తున్న ఓవరాక్షన్ ఏంటో తెలిసిపోయింది. దీనితో టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం ఉమామహేశ్వరరావుపై కన్నేసింది. అతడి ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ సరైన సమయాన్ని ఎంచుకుని అతడిని అదుపులోకి తీసుకుంది. అరెస్టు అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అతడు ఒంటరిగా ఈ వ్యవహారం జరిపాడా..? లేక మరెవరైనా వ్యక్తులు లేదా అధికారులు అతనికి తోడుగా ఉన్నారా..? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉమామహేశ్వరరావును కస్టడీలో ఉంచి పోలీసులు అతని కాల్ డేటా, ఫైనాన్షియల్ లావాదేవీలు, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. అతడు ఇంతకాలం ఎవరి ఇళ్లకు వెళ్లాడు, ఎవరిని బెదిరించాడు, ఆర్థిక లావాదేవీలు జరిగాయా వంటి అంశాలను వెలికితీస్తున్నారు. త్వరలోనే అతడిపై పూర్తి వివరాలతో కేసు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నారు.