తెలంగాణ రవాణా రంగ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తుది లొకేషన్ సర్వే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, రాష్ట్ర రాజధానిని చుట్టూ కొత్త రైల్వే మార్గం ఏర్పడనుండగా, ఇది దేశంలోనే వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. ఔటర్ రింగ్ రైలు మార్గం ప్రధానంగా సికింద్రాబాద్‌ను అనుసంధానించే ఆరు రైలు కారిడార్లతో కలిపి రూపొందించనున్నారు. వాటిలో సికింద్రాబాద్–కాజీపేట, వాడి, డోన్, ముర్కడ్, గుంటూరు, కొత్తపల్లి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలతో అనుసంధానం వల్ల రైల్వే రాకపోకలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది.
గూడ్స్ రైళ్లకు ప్రత్యామ్నాయ మార్గం
ఈ రింగ్ రైలు ఏర్పాటు ద్వారా ముఖ్యంగా గూడ్స్ రైళ్లను నగరానికి రాకుండా బైపాస్ చేయవచ్చు. తద్వారా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర రైళ్లు ఈ కొత్త మార్గం ద్వారా సాఫీగా ప్రయాణించగలవు.
మూడు ఎలైన్‌మెంట్‌లతో ప్రతిపాదనలు సిద్ధం
ప్రాజెక్టు కోసం దక్షిణ మధ్య రైల్వే మూడు వేర్వేరు ఎలైన్‌మెంట్‌లను ప్రతిపాదించింది. వాటిలో ప్రతి దానికీ దూరం, వ్యయం, మలుపుల సంఖ్య, టన్నెళ్ల పొడవు వంటి అంశాలపై స్పష్టమైన అంచనాలు రూపొందించారు. వీటిలో దూరం 392 కిలోమీటర్ల నుంచి 511 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముంది.
నిర్మాణ వ్యయం రూ. 12,000 కోట్ల నుండి రూ. 17,700 కోట్ల వరకు
ఈ మూడు ప్రతిపాదిత మార్గాల్లో నిర్మాణ వ్యయం రూ.12,070 కోట్ల నుంచి రూ.17,763 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు సాంకేతికత, భౌగోళిక పరిస్థితులు, భూసేకరణ పరిస్థితుల ఆధారంగా ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు.
ఎనిమిది నుంచి పది జిల్లాలకు లాభం-
ఔటర్ రింగ్ రైలు మార్గం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట వంటి జిల్లాలకు అనుసంధానమవుతుంది. కొన్ని ప్రతిపాదనలలో కామారెడ్డి, జనగామ వంటి జిల్లాలూ చేరే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు హైదరాబాద్ చేరడం సులభమవుతుంది.
దేశంలోనే తొలిసారి రింగ్ రైలు ప్రాజెక్టు
ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా నగరాన్ని చుట్టూ పూర్తిస్థాయి రింగ్ రైలు నిర్మించిన దాఖలాలు లేవు. బెంగళూరు, చెన్నై, ముంబయిలో శివార్లకు టెర్మినల్స్ నిర్మించినా, హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు నిర్మాణం మాత్రం దేశంలోనే మొదటిసారి జరగనుంది. ఇది రవాణాలో సరికొత్త దిశగా తీసుకెళ్లే ప్రణాళికగా మారనుంది.
రైల్వే స్టేషన్ల సంఖ్య 26 నుంచి 34 వరకు
ఈ రింగ్ రైలు మార్గంలో కనీసం 26 నుంచి గరిష్ఠంగా 34 స్టేషన్లు ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా రైల్వే స్టేషన్లు నిర్మించడం వల్ల స్థానిక రవాణా మెరుగవుతుంది. జిల్లాల మధ్య రైలు ప్రయాణాలు వేగవంతమవుతాయి.
ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుదలతో ప్రయోజనాలు
ఈ ప్రాజెక్టు అమలుతో హైదరాబాద్ నగరానికి వచ్చిన రైళ్లను ఔటర్ రింగ్ రైలులో మళ్లించవచ్చు. దీనివల్ల నగరంలోని ప్రధాన స్టేషన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ తరహాలో నగరానికి బయటే రాకపోకలు నడిపించే అవకాశాన్ని కల్పిస్తుంది.
తరువాతి దశలో నిర్మాణానికి అడుగులు..
ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి కావడంతో తదుపరి దశలో ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసి నిర్మాణానికి అనుమతులు పొందే ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.