వీసాల గడువు ముగిశాక కూడా అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న విదేశీయులను గుర్తించే పనిలో పడ్డారు హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు. ఇందలో భాగంగానే శుక్రవారం టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా మౌంట్ కాలనీలో కార్డన్ సర్చ్‌తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీసాల గడువు పూర్తైన అక్రమంగా ఇక్కడే నివసిస్తున్న 18 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు.
గత ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో ఇలాంటి అవాంచనీయ ఘటనలు మళ్లీ తలెత్తకుండా కట్టుదిట్టమైన భత్రద చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై గుర్తించి.. వారిని తిరిగి పంపించే అంశంపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని టోలిచౌకి పీఎస్ పరిధిలో సౌత్ వెస్ట్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ కార్డెన్ సర్చ్‌తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్‌ను నిర్వహించగా వీసాల గడువు పూర్తయిన తర్వాత కూడా ఉంటున్నటువంటి విదేశీయులను గుర్తించారు.
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 18 మంది విదేశీయులు వీసాలు గడువు పూర్తయినా కూడా ఇండియాలోనే ఉన్నట్లు గుర్తించారు. వీరు మెడికల్ ఎమర్జెన్సీ, స్టూడెంట్ వీసాల మీద 2023లో ఇండియాకు వచ్చిన వీరు వీసాల గడువు పూర్తైనా తిరిగి తమ దేశాలకు వెళ్లకుండా ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరందరూ కెన్యా, నైజీరియా, ఈటోపియా, సోమాలియా దేశాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు.
వీరితోపాటు, సరైన పత్రాలు లేని 32 వాహనాలను, మద్యం బాటిల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే గతంలో నైజీరియా నుంచి స్టూడెంట్ వీసా మీద ఇండియాకు వచ్చిన కొందరు విదేశీ యువకులు ఇదే కాలనీలో ఉంటూ వీసా గడువు పూర్తైన వెళ్లకుండా.. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారు ఎవరైనా మళ్లీ ఇక్కడ ఉన్నారేమోననే అనుమానంతో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారి వివరాలను ఎఫ్ఆర్ఓకి పంపించి డిపోర్ట్ చేస్తామని సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ వెల్లడించారు.