దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ సర్వే నిర్వహిస్తోంది. బుల్లెట్ రైలుతో హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. ప్రస్తుతం 12గంటల సమయం పడుతోంది.
దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి రైలులో వెళ్లడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పూర్తయితే.. ఈ ప్రయాణ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన RITES సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహిస్తోంది. ఇందులో ట్రాఫిక్ విశ్లేషణ, డిమాండ్ అంచనాలు, సర్వేలు వంటివి ఉంటాయి. అనంతరం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇదే సంస్థ తయారు చేయనుంది.
నాలుగు నగరాలకు కనెక్టివిటీ
దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సర్వే ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రైలు నెట్‌వర్క్ దక్షిణ భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరులను కలుపుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నాలుగు నగరాల పరిధిలో 5 కోట్లకు పైగా జనాభా ఉందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి, కనెక్టివిటీకి గణనీయంగా తోడ్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
దేశంలో సాధ్యమయ్యే బుల్లెట్ రైలు మార్గాలు
దేశవ్యాప్తంగా మరిన్ని బుల్లెట్ రైలు మార్గాలను నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. గతంలో జాతీయ రైలు ప్రణాళిక హై స్పీడ్ రైలు నెట్‌వర్క్ అభివృద్ధి కోసం పలు మార్గాలను ప్రస్తావించింది. అందులో ఢిల్లీ – వారణాసి, ఢిల్లీ – అహ్మదాబాద్, ముంబై – నాగ్‌పూర్, ముంబై – హైదరాబాద్, చెన్నై – మైసూర్, ఢిల్లీ – అమృత్‌సర్, వారణాసి – హౌరా వంటివి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.