ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం.
ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి శక్తివంతమైన రూపం అయిన ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది. ఆమెను దుర్గ, కాళి,ఇతర దేవత రూపాల అవతారంగా భావిస్తారు. వ్యాధులు నివారణ, కోరికలు తీర్చడానికి, దుష్ట శక్తుల నుంచి రక్షణ ఇచ్చే దైవంగా భావించి భక్తులు ఆమెను పూజిస్తారు. దేవతతో పాటు కొన్ని అనుబంధ దేవతలను కూడా ఆలయంలో పూజిస్తారు. అయితే ఇక్కడ ప్రధాన దైవంగా ఎల్లమ్మ భక్తులతో పూజలను అందుకుంటుంది.
ఎల్లమ్మ దేవత ఎవరో తెలుసా? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం శక్తి రూపంగా, రేణుకా దేవి అవతారంగా పరిగణించబడే ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది. రేణుకా దేవి పరశురాముడి తల్లి. హిందువుల విశ్వాసాల ప్రకారం రేణుకా దేవి త్యాగ గుణం ఉన్న దేవతగా భావిస్తారు. ఎల్లమ్మ బాధలను నాశనం చేస్తుందని, పేదరికాన్ని నిర్మూలిస్తుందని , కోరికలను నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు.
ఆలయ చరిత్ర , ఇతిహాసాలు ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది. అనేక ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ ఆలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు. స్థానిక నమ్మకాల ప్రకారం ఎల్లమ్మ దేవత స్వయంభు దేవత. ఎల్లమ్మ మె విగ్రహం భూమి నుంచి బయల్పడింది. గతంలో ఈ ప్రదేశం దట్టమైన అడవిగా ఉండేది. అక్కడ దేవత కనిపించింది. అప్పటి నుంచి ఎల్లమ్మని పూజిస్తున్నారని కూడా చెబుతారు. ఆలయం మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే.. ఇక్కడ అమ్మవారి విగ్రహం భూమికి కొంత దిగువన ఉంది. భక్తులు దేవత దర్శనం చేసుకోవడానికి క్రిందికి దిగాలి. ఈ ప్రత్యేకమైన నిర్మాణం ఆలయం ప్రాచీనత, పవిత్రతను మరింత పెంచుతుంది.
ఆలయానికి సంబంధించిన ప్రత్యేక నమ్మకాలు
వ్యాధి నివారణ: ఎల్లమ్మ దేవిని పూజించడం వల్ల చర్మ వ్యాధులు సహా ఇతర వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
కోరికలు నెరవేరడం: వివాహం, పిల్లల పుట్టుక, ఉద్యోగం , వ్యాపార విజయం వంటి వివిధ కోరికలు నెరవేరాలని భక్తులు దేవిని ప్రార్థిస్తారు.
నవరాత్రి ప్రాముఖ్యత: చైత్ర, శారదయ నవరాత్రుల సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు.
బోనం పండుగ: తెలంగాణలోని ప్రసిద్ధ బోనాల పండుగను ఈ ఆలయంలో ఎంతోఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల చీరలు ధరించిన మహిళలు సాంప్రదాయ పద్ధతిలో బోనం (బియ్యం , బెల్లం వంటకం) తీసుకుని ఆలయానికి వచ్చి దేవతకు సమర్పిస్తారు.
ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు ప్రతి సంవత్సరం ఆషాఢ , శ్రావణ మాసాలలో దేవత ఎల్లమ్మ జన్మదినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఆలయంలో అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.