రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ప్రవేశాలకు జులై 7వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ కౌన్సెలింగ్‌లో స్థానికత అంశం ప్రస్తుతం విద్యార్ధుల పాలిట కొరకరాని కొయ్యలా మారింది. పదో తరగతి వరకు ఏపీలో చదివినప్పటికీ ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో స్థానికేతర కోటా చూపడంతో కొందరు తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి 2024లోనే వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో సీట్లన్నీ రాష్ట్ర విద్యార్ధులకే లభించేలా కొత్త జీఓను కూడా సర్కార్ విడుదల చేసింది. దీని ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటాలోని 15 శాతం సీట్లను కూడా రాష్ట్ర విద్యార్థులకే కేటాయించేలా మార్పులు చేశారు.
అయితే ప్రభుత్వం చేసిన ఈ మార్పులపై అవగాహనలేని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రవేశాల ప్రక్రియలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశానికి ముందు వరుసగా నాలుగేళ్లల్లో ఏ ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివినా వాళ్లను స్థానికేతరులుగా పరిగణిస్తామని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. గతంలో ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాల రీజియన్లు ఉండగా ఉండేవి. ప్రత్యేక రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవడంతో వీటిల్లో ఉస్మానియా రీజియన్‌ను తొలగించిన సర్కార్.. కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటే.. ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో పదేళ్లపాటు ఏపీలో నివసించి ఉంటే వీరు స్థానికేతర కోటాలోని 15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు. మరోవైపు కొంతమంది తల్లిదండ్రులు ఏపీలో నివాసం ఉంటున్నప్పటికీ.. వారి పిల్లలను మాత్రం తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివించారు. ఇప్పుడు వీళ్లు స్థానికేతర కోటాను పొందాలంటే 10 ఏళ్లు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు స్థానిక కోటా లభించకపోవడంతో పదో తరగతి వరకు చదివిన పాఠశాలను పరిగణనలోకి తీసుకుని లోకల్ కింద పరిగణించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు విజ్ఞప్తులు చేస్తున్నారు.