‘బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’.. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..

పార్లమెంట్‌లో అదానీ -సోరోస్‌ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం సంచలనంగా మారింది.. రాజ్యసభలో తమకు మాట్లాడడానికి ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఆరోపించింది.. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఛైర్మన్‌గా ఉన్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌పై రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై 70 మంది విపక్ష ఎంపీలు సంతకాలు పెట్టారు.

అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌, ఆప్‌ , ఎస్పీ, టీఎంసీ ఎంపీలు సంతకాలు పెట్టారని జైరాం రమేష్ చెప్పారు. సభలో విపక్షాలకు ఇప్పటికైనా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇండి సభ్యులతో చైర్మన్‌ వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని వివరించారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే, 70 మంది ఎంపీలు తమకు మద్దతుగా సంతకాలు చేశారని కాంగ్రెస్ నాయకురాలు రణజీత్‌ రంజన్‌ పేర్కొన్నారు.

కాగా.. రాజ్యసభలో వైసీపీ 8, బీజేడీ 7 , బీఆర్‌ఎస్‌కు 4 మంది ఎంపీల బలం ఉంది. ఈ మూడు పార్టీలు ఏ కూటమిలో కూడా లేవు.. దీంతో అవిశ్వాస తీర్మానంపై మూడు పార్టీల వైఖరి ఉత్కంఠ రేపుతోంది.

చరిత్రలో తొలిసారి..

రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. రాజ్యసభలో బీజేపీకే మెజారిటీ ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే రాజ్యసభలో 50 శాతం ఎంపీల ఆమోదంతో పాటు లోక్‌సభ కూడా 50 శాతం ఎంపీలు ఆమోదించాలి.అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ మెజారిటీ లేదు.. దీంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. రాజ్యాంగం అలాగే.. ప్రొసీజర్‌ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి.. అయితే ఈ పార్లమెంట్‌ సెషన్‌ డిసెంబర్‌ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని సమాచారం..

సభా గౌరవాన్ని కాపాడుకోవాలి.. ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు..

పార్లమెంటులో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ అసహనం వ్యక్తంచేశారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను మనం నెరవేర్చాలని.. సభా గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బాగుండటం లేదన్నారు.. ప్రతిపక్ష నేత, సభ్యులు హుందాగా నడుచుకోవాలంటూ.. ఇండి కూటమి తీరుపై అసహనం వ్యక్తంచేశారు.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *