విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న కనకదుర్గమ్మను దర్శించాలంటే ఇక డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.. మహిళలైనా, పురుషులైనా సరే నిబంధనలు తప్పనిసరి అంటున్నారు ఆలయ అధికారులు..తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలకు చీర, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్, పురుషులైతే ధోతీ లేదా పైజామా, చొక్కా ధరించాలని పేర్కొంటున్నారు.
తిరుపతి తర్వాత రెండో అతి పెద్ద ఆలయంగా ప్రశస్తి పొందిన ఇంద్రకీలాద్రిపై తిరుపతి తరహాలోనే అభివృద్ధి జరగాలని గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శీనా నాయక్ నిబంధనలు పక్కాగా అమలు కావాల్సిందే అంటూ పట్టు పట్టడంతో ఇంద్రకీలాద్రిపై ఎట్టకేలకు మార్పుకు బీజం పడింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. ఇంద్రకీలాద్రి దిగువన మహా మండపం వెళ్లే దారిలో ఆక్రమణలను తొలగించి వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు.
ఆలయంలోకి వచ్చే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ను అమలును తప్పనిసరిచేశారు అధికారులు. అభ్యంతరకర దుస్తుల్లో వచ్చినవారిని వెనక్కి పంపుతున్నారు సిబ్బంది. మహిళలకు చీర లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీజ్, పురుషులైతో సంప్రదాయ దుస్తులైన ధోతీ లేదా పైజామా, చొక్కా ధరించాలని నిబంధన విధించారు. అంతేకాక మొబైల్స్ కూడా అనుమతించరు. మొబైల్స్ నిర్ణీత కౌంటర్లో భద్రపపరిచి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఏపీలోనే కాక దేశంలోనే ప్రసిద్ధిపొందిన ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో సంప్రదాయ దుస్తులు ధరించే రావాలన్న నిబంధనను భక్తులు కూడా స్వాగతిస్తున్నారు. రానున్న తరాలకు మన సంప్రదాయాలపట్ల అవగాహన కలుగుతుందని చెబుతున్నారు.