యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగాంధ్రతో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా విశాఖలో 30 కిలోమీటర్లు పరిధిలో దాదాపు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశారు.. శనివారం విశాఖలో నిర్వహించే యోగా డే చరిత్రలో నిలిచిపోనుంది.. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం ఒక వైపు సముద్రతీరపు శాంతి, మరోవైపు తూర్పు కనుమల ఆకర్షణ.. కాని ఇదే భౌగోళిక స్వభావం ఇప్పుడు యోగా మహా సంగమం వంటి భారీ కార్యక్రమాల నిర్వహణకు కేంద్రంగా మారుతోంది. అయితే.. ఇటీవల కాలంలో విశాఖపట్నం పరిసరాల్లో పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.
పాములను నివారించేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ స్ప్రే
బీచ్ రోడ్ వెంబడి యోగా కార్యక్రమంలో పాల్గొనబోయే లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు ముందస్తుగా పాములను పట్టే 50 మందితో కూడిన ప్రత్యేక బృందంను మోహరించారు. ఈ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అంతేకాదు, పాములను ఆకర్షించకుండా ఉండేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ను స్ప్రే చేస్తూ.. నివారణ చర్యలు చేపట్టారు.
లెమన్ గ్రాస్ ఆయిల్ పాములకు అసహ్యమైన వాసన కలిగేలా చేస్తుంది. దీన్ని వేదిక పరిసర ప్రాంతాల్లో, అడవి ప్రాంతాలకు సమీపంలో విస్తృతంగా స్ప్రే చేశారు. జోడుగుళ్లపాలెం కొండ ప్రాంతంలో ముఖ్యంగా ఈ స్ప్రే అపరేషన్ నిర్వహించారు. ఇది నాణ్యమైన – పర్యావరణహితమైన మార్గం.. అలాగే హానికరం కాని పద్ధతి అని సిబ్బంది పేర్కొంటున్నారు.