IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ కుదరలేదు. టిక్కెట్ల క్యాన్సలేషన్ కూడా సాధ్యంకాలేదు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు.
వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని, అందువల్ల మరో 1 గంట వరకు బుకింగ్ ఉండదని IRCTC ఒక ప్రకటన విడుదల చేసింది. టికెట్ రద్దు చేసుకునేందుకు కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755 -4090600 నెంబర్లకు ఫోన్ చేయాలని లేదా etickets@irctc.co.inకు మెయిల్ చేయాలని ఐఆర్‌సీటీసీ ఆ ప్రకటనలో కోరింది.
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ-టికెట్ బుకింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ నిలిపివేయడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్ మీడియా వేదికలపై తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.