క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?

బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి.

కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి పాత్ర వాళ్లు పోషించారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు రేగింది. కారణమేంటో తెలియదు కానీ… ఒకరు పార్టీకి దూరం కావడం.. మరో ముగ్గురిపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్‌) పార్టీలో కవిత కల్లోలం కొనసాగుతోంది. ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలంటూ పార్టీలో చర్చ మొదలైంది. పార్టీకి నష్టం జరుగుతున్న సమయంలో చర్యలకు వెనకాడితే కేడర్‌ అయోమయంలో పడుతుందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చర్యలపై రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది.

అయితే కవితపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. గతంలో పలువురు సీనియర్‌ నేతలపై తీసుకున్న చర్యలను గుర్తు చేస్తున్నారు. పార్టీలో 12 ఏళ్లుగా క్రమశిక్షణా కమిటీ లేదు. పార్టీ లైన్‌ దాటితే నేరుగా చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎవరు గీత దాటినా షోకాజ్‌లు, నోటీసులు, సస్పెన్షన్లు ఉండవు. నేరుగా పార్టీ నుంచి బహిష్కరించడమే ఉంటుందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

గతంలో గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్రలపై బహిష్కరణ వేటు వేసింది పార్టీ. అనంతరం నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ భూపతి‌రెడ్డిపైనా బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో కూడా నేరుగా బహిష్కరణ వేటు వేసింది పార్టీ. ఇక్కడ కమిటీలు, విచారణలు ఉండవు. హద్దు దాటారని భావిస్తే అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో నేరుగా బహిష్కరణ విధిస్తారు. పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్లు మళ్లీ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

About Kadam

Check Also

ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *