తెలంగాణకు భూకంపాల భయాలేం లేవు.. మనది దక్కన్ పీఠభూమి.. సముద్రానికి ఎత్తులో ఉంటుంది.. నిర్భయంగా ఉండొచ్చని చెబుతుంటారు కొందరు. ఎవరు చెప్పారసలు తెలంగాణ భూకంపాల జోన్‌లో లేదని? దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. కావాలంటే ఆ లిస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలోని ఏరియాలు కూడా ఉంటాయి. మెయిన్‌గా హైదరాబాద్ ఉంటుంది. సో, హైదరాబాద్‌కు కూడా భూకంపం ముప్పు ఉంది. ఒక్క తెలంగాణ గురించే ఎందుకు చెప్పుకోవాలి? విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు.. ఇవన్నీ భూకంపాల జోన్‌లోనే ఉన్నాయి. కాకపోతే, జియోలజిస్టులు ఏం చెబుతారంటే.. తక్కువ, అతి తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే ప్రాంతాలు కాబట్టి అంతగా కంగారు పడక్కర్లేదు అని. అంతే తప్ప.. అసలు భూకంపాలు రానే రావు అని కాదు దానర్థం. ఇక.. మేడారం జాతర జరిగే ములుగు జిల్లాలో ఓ విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. పంచభూతాల్లోని నేల, నీరు, గాలి.. ములుగును పగబట్టాయా అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని ఓ వింత వాతావరణం, ప్రకృతి ప్రకోపం కనిపిస్తోందక్కడ. ఇంతకీ కారణం ఏంటి? భూకంపాల విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎంత వరకు సేఫ్? ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయి? హైదరాబాద్, విశాఖ నగరాలు సేఫ్‌గా ఉంటాయా? ఇవాళ్టి టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌లో అన్నిటికీ సమాధానాలు చెప్పుకుందాం.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 దాటి రావడం అంటే.. కచ్చితంగా బిగ్‌బ్రేకింగ్ వేసి చెప్పుకోవాల్సిన వార్తే. అందులోనూ.. భూకంపాలు అతితక్కువగా వచ్చే తెలంగాణలో ఈస్థాయిలో రావడం అంటే.. కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపం 5.3గా రికార్డ్ అయింది. ఈస్థాయి భూకంపం వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇక భద్రాచలం దగ్గర 1969లో వచ్చిన భూకంపం 5.7గా రికార్డ్ అయింది. అప్పట్లో వచ్చిన భూకంపానికి భద్రాచలం దగ్గర్లోని పర్ణశాల గుడి పడిపోయింది. పర్ణశాల వద్ద గోదావరికి ఎదురుగా లక్ష్మణగుట్ట అని ఉంటుంది. అదే భూకంప కేంద్రంగా గుర్తించారు. ఆనాటి భూకంప తీవ్రతను గమనించడానికి హైదరాబాద్ నుంచి సైంటిస్టులు కూడా వెళ్లారు.
ములుగులో భూకంపం 5.3 స్థాయిలో వచ్చినప్పటికీ.. ఇప్పటికైతే ఏం నష్టం జరగలేదుగా..! మరి ఎందుకని ఈ భూకంపం గురించి మాట్లాడుకోవాలి? కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే.. ములుగు అనేది గోదావరి పరీవాహక ప్రాంతం. పైగా మరోవైపు బొగ్గు గనులు ఉండే ప్రాంతం కూడా. ఈ బొగ్గుగనుల్లో ఓపెన్ కాస్ట్‌లే కాదు.. భూగర్భ గనులు కూడా ఉంటాయి. 24 గంటల పాటు బొగ్గు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అంటే.. భూమిలోపలి ఖనిజాన్ని ఖాళీ చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల భూమిలోపలి పొరలు మరింత పలుచబడతాయి. ఇక.. గోదావరిపై ఎడాపెడా ప్రాజెక్టులు కడుతున్నారు. 1869 నుంచి 2020 వరకు.. ఈ గోదావరి తీరంలోనే 25 సార్లు భూకంపాలు వచ్చాయి. పైగా ఈ ములుగు దగ్గరల్లోనే తూపాకులగూడెం బ్యారేజీ ఉంది. ఈమధ్యే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా నిర్మించారు. దగ్గర్లోనే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఉంది. దీనికి దగ్గర్లోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా నిర్మితమవుతోంది. భద్రాచలం-కొత్తగూడెం ఏరియాలు పోలవరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు. గత 151 ఏళ్లలో గోదావరి నదీ తీరంలో 25 సార్లు భూకంపాలు వస్తే.. వాటిలో 8సార్లు కేవలం భద్రాచలం-కొత్తగూడెం ఏరియాల్లో వచ్చినవే. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఎక్కడికక్కడ గోదావరి జలాలను ఒడిసిపట్టి, నిలుపుతున్నారు. ఇవన్నీ.. భూకంపాలకు కారణాలా అంటే.. అలాగని చెప్పలేం. కాని, తెలంగాణలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్నది మాత్రం గోదావరి నదికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోనే అనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట.
ఎందుకని గోదావరి తీరంలోనే భూకంపాలు వస్తాయి? ఎందుకంటే.. ఈ గోదావరి అడుగు భాగంలోని భూమి పొరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. పైగా ఈమధ్య గోదావరిపై కట్టిన ప్రాజెక్టుల కారణంగా.. భూమిలోకి గోదావరి జలాలు ఇంకుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయన్నది సంతోషించే వార్తే అయినా.. ఈ ప్రాజెక్ట్ కారణంగా భూమిలో నీరు కూడా బాగా పెరిగిందంటున్నారు. అప్పట్లో ఓ షాకింగ్ వార్త కూడా వినిపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సీస్మిక్ జోన్‌లో ఉంది. అంటే.. ఈ రిజర్వాయర్ భూకంపం ముప్పు ఉన్న ప్రాంతంలో కట్టారని కేంద్రప్రభుత్వ సంస్థ NGRI కూడా గతంలో హెచ్చరించింది. ఇలా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కారణంగా భూమిలోకి నీరు చేరడం కారణంగా.. భూమిలోని ప్లేట్ల కదలికలు మరింత తేలిక అవుతాయంటున్నారు నిపుణులు. భూమిలోపల గట్టిదనం తగ్గి మెత్తగా మారడం వల్ల భూమిలోపలి పొరలు త్వరగా కదిలేందుకు ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు. అంటే.. ఎక్కడైతే గోదావరిపై ప్రాజెక్టులు ఉన్నాయో, ప్రస్తుతం ఎక్కడ బొగ్గు గనులు ఉన్నాయో.. అక్కడ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టే లెక్క. అక్కడ గానీ భూకంపం వస్తే.. దాదాపుగా చుట్టుపక్కల 300 కిలోమీటర్ల పరిధి వరకు భూప్రకంపనలు ఉంటాయి. అందుకేగా.. ములుగులో భూమి కంపిస్తే హైదరాబాద్ నుంచి విశాఖ వరకు భూమి కంపించింది. ఓవరాల్‌గా.. తెలంగాణ నేలపై ఇది వరకు లేనంత ఒత్తిడి పడుతోందన్నది నిజం.
ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు 52 కిలోమీటర్ల ఎగువన అదృశ్య గోదావరి ఉంది. పిన్‌పాయింట్‌గా చెప్పాలంటే.. ప్రస్తుత ఏలూరు జిల్లా వేలేరుపాడు దగ్గర్లోని కోయిదా దగ్గర గోదావరి మాయం అవుతోంది. ఈ కోయిదా దగ్గర 1983లో 58వేల 616 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. పోలవరం దగ్గరకు వచ్చే సరికి 40వేల 176 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే కనిపించింది. మరి ఆ 18వేల 440 క్యూసెక్కుల నీరు ఎక్కడికి పోయింది? 1986లో మరోసారి పరీక్షించారు. కోయిదా మీదుగా 1,552 టీఎంసీల నీరు ప్రవహిస్తే.. పోలవరం వద్దకు వచ్చే సరికి 1,345 టీఎంసీలకు తగ్గిపోయింది. ఏకంగా 207 టీఎంసీల గోదావరి మాయమైంది. ఈ నీరంతా ఎక్కడికి పోయిందని ఆరా తీస్తే.. బిగ్ డీప్ బెడ్ ప్రొఫైల్‌లోకి వెళ్లిపోయిందని తేలింది. అంటే.. భూమి లోపలి పొరలలోకి ఆ నీరంతా వెళ్లిపోయింది. సరిగ్గా ఏ ప్రాంతంలో ఈ నీరు మాయమవుతోందో చెప్పలేకపోతున్నారు గానీ.. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన 52 కిలోమీటర్ల పరిధిలోనే ఇలా జరుగుతోందని మాత్రం కచ్చితంగా చెబుతోంది CWC. ఒకరకంగా ఈ ఏరియా కూడా ములుగు ప్రాంతానికి దగ్గరే. సో, గోదావరి పరీవాహకంలో ప్రాజెక్టుల వల్ల భూకంపాల ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు అనేది కొందరి విశ్లేషణ.
ఈ ఎపిసోడ్ మొదట్లో ములుగులో ఓ విచిత్ర వాతావరణం ఉందని చెప్పకున్నాం కదా.. ఆ డిటైల్స్‌లోకి వెళ్దాం. ఎందుకనో.. ములుగు ప్రాంతంపై ప్రకృతి పగబట్టిందేమో అనిపిస్తోంది. ఏడాది ఆగస్ట్ 31న.. ములుగు అడవుల్లో గాలిదుమారం రేగింది. అలాంటిఇలాంటి గాలిదుమారం కాదది.. ఓ భారీ టోర్నడో. జస్ట్ గంట వ్యవధిలోనే 500 ఎకరాల్లోని దాదాపు లక్ష చెట్లు నేలకొరిగాయి. అవేమీ చిన్నాచితకా చెట్లు కాదు. నల్లమద్ది, తెల్లమద్ది, జువ్వి, మారేడు, ఇప్ప, నారెప.. ఇలాంటి పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా బయటికొచ్చాయి. కొన్ని చెట్లయితే.. బట్టలు ఉతికాక నీళ్లులేకుండా చేసేందుకు మెలితిప్పుతాం చూశారా.. అలా మెలితిరిగాయి. మరికొన్ని చెట్లు నిలువుగా చీలిపోయాయి. 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి డ్యామేజ్ చూల్లేదని అక్కడి అటవీశాఖ అధికారులు చెప్పారు. కనీవినీ ఎరుగని ఒక టోర్నడో.. ములుగు అడవుల్లో బీభత్సం సృష్టించడంతో.. IMD, NRCC, NGPRI-CSIR, డెహ్రాడూన్ నుంచి ICFRE, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ అట్మాస్పియర్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, వివిధ యూనివర్సిటీలు, ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ప్రొఫెసర్లు ములుగుకు వెళ్లారు. గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడం వల్లే చెట్లు కూలాయని చెప్పారే తప్ప.. ఇప్పటివరకైతే స్పష్టమైన కారణం ఏదీ తెలియలేదు. కాకపోతే.. 2019 జులైలో జరిగిన ఓ భయానక వాతావరణ పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. జులై 9న ములుగు ఫారెస్ట్ ఏరియాలో.. మేఘాలు ఆల్‌మోస్ట్ నేల మీదకు వాలిపోయాయి. దాదాపు ఇళ్లను తాకుతూ కారుమేఘాలు కమ్మేశాయి. ఆనాటి పరిస్థితి చూసి.. ఇవాళ ప్రళయం తప్పదేమో అనుకున్నారంతా. కాని, కొన్ని గంటల తరువాత ఆ మేఘాలు ఆకాశం వైపు వెళ్లిపోయాయి. ములుగులో టోర్నడోకు ముందు కూడా అలాంటి పరిస్థితే కనిపించిందంటున్నారు స్థానికులు.
ఇక అదే ములుగు ఏరియాలో.. ఈమధ్య అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షాలు పడి విజయవాడ మునిగిపోయింది చూశారూ.. అదిగో అదే సమయంలో ములుగులో వానబీభత్సం సృష్టించింది. కాకపోతే, విజయవాడ గురించి మాట్లాడుకున్నంతగా ములుగు గురించి మాట్లాడుకోలేదంతే. సో, ములుగుపై నీరు ప్రకోపించింది, గాలి ప్రకోపించింది, తాజాగా నేల కూడా పగబట్టినట్టు ప్రకోపించింది. అందుకే అన్నది.. ములుగులో ఏదో తెలియని ఓ విచిత్ర వాతావరణం ఉందని.
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ.. ఇలాంటి నగరాలకు భూకంపం ముప్పు ఉందా? వస్తే ఏ స్థాయిలో భూకంపం వస్తుంది? ఈ సమాధానం కంటే ముందు.. భూకంప జోన్ల గురించి తెలుసుకోవాలి. అంటే.. ఎంత తీవ్రతతో భూమి కంపిస్తే, ఎంత నష్టం జరుగుతుందో చెప్పే ఓ టేబుల్ అది. భూకంప తీవ్రతను మాగ్నిట్యూడ్ అంటారు. ఈ మాగ్నిట్యూడ్ 7 అంతకంటే ఎక్కువ వస్తే జోన్-5గా పరిగణిస్తారు. జపాన్, ఈక్వెడార్, టర్కీ, మెక్సికో, నేపాల్.. ఇవన్నీ హైరిస్క్ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ భూకంపాలు వస్తే ఆస్తి, ప్రాణ నష్టం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక మాగ్నిట్యూడ్ 6-7 రేంజ్‌లో వస్తే.. దాన్ని జోన్-4 అంటారు. మాగ్నిట్యూడ్ స్కేల్‌పై 5తో భూకంపం వస్తే.. దాన్ని జోన్-3 కేటగిరీ అంటారు. 1 నుంచి 4 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే.. దాన్ని జోన్-2 పరిధి అంటాం. మరి జోన్-1 సంగతేంటి? 1993 తరువాత జోన్-1ని ఎత్తేశారు. అది మరో టాపిక్ అనుకోండి. ప్రస్తుతానికి మన టాపిక్ అంతా.. తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ ప్రాంతాలు ఏ జోన్‌లో ఉన్నాయి, ఏ స్థాయిలో భూకంపాలు వస్తాయన్నదే ఇక్కడ ముఖ్యం. సో, ముందుగా హైదరాబాద్ గురించి చూద్దాం.
హైదరాబాద్ అనేది జోన్-2 పరిధిలో ఉంది. అంటే.. రిక్టర్ స్కేలుపై 1 నుంచి 4 స్థాయిలో భూకంపం రావొచ్చు. జియోలజిస్టులు దీన్నే.. అతితక్కువ స్థాయి భూకంపాల జోన్ అంటుంటారు. అలాగని.. భూకంపాలే రావా అంటే.. వస్తాయి. కాని, దాదాపుగా మనం ఫీల్ అవ్వనంత స్థాయిలో భూమి కంపిస్తుంది. సాధారణంగా భూకంపం వచ్చిందని మనం ఫీల్ అవ్వాలంటే, మనకు తెలియాలంటే రిక్టర్ స్కేలుపై 5 అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఉండాలి. సో.. 1 నుంచి 4 స్థాయిలో వచ్చినా హైదరాబాదీస్‌కు పెద్దగా తెలీదు. ఇప్పుడు ములుగులో వచ్చింది 5.3 స్థాయి కాబట్టి హైదరాబాద్‌లోని వారికి కూడా భూమి కంపించినట్టు తెలిసింది.
గత ఆరు దశాబ్దాల్లో తెలంగాణలో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి. 1969 జూన్‌లో భద్రాచలంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. 1983లో మేడ్చల్‌లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 2021 జనవరి 26న సూర్యాపేట సమీపంలోని పులిచింతల వద్ద 4.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. తాజాగా ములుగులో వచ్చింది నాలుగో అతిపెద్దది. హైదరాబాద్ జోన్-2లో సేఫ్‌జోన్‌లో ఉంది సరే.. ఒకవేళ భూకంపం వస్తే హైదరాబాద్‌లోని ఏ ఏరియాలు ఎఫెక్ట్ అవుతాయో తెలుసా. అబిడ్స్, అమీర్‌పేట, సోమాజిగూడ సహా కోర్ సిటీ ప్రాంతాల్లో స్వల్పంగా భూకంప ప్రభావం ఉండచ్చు. ఇక మెహదీపట్నం, తార్నాక, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్వల్పంగా ప్రభావం ఉంటుంది. మల్కాజిగిరి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో అప్పుడప్పుడు భూప్రకంపనలు వస్తుంటాయి. అల్వాల్, కూకట్‌పల్లి, లింగంపల్లి, నాగోల్ తదితర ప్రాంతాల్లోనూ చాలా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి ఒకప్పుడు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భూకంపం వల్ల ఇళ్లు కూలిపోవడం జరగలేదు. ఎందుకంటే.. మాగ్నిట్యూడ్ చాలా తక్కువ కాబట్టి. సో, హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్ కట్టినా భయపడాల్సిన అవసరం లేదు.. ఒకవేళ అత్యంత దారుణమైన క్వాలిటీతో బిల్డింగులు కడితే తప్ప. నిజానికి క్వాలిటీ లేని నిర్మాణాల వల్ల మ్యాన్ మేడ్ భూకంపాలు వస్తాయి. అంటే.. ఓ బిల్డింగ్ కడుతుంటే.. ఆ ధాటికి పక్కవి పడిపోతుంటాయి. అంతేతప్ప హైదరాబాద్‌కు భూకంప భయాలు లేవు. అదృష్టం ఏంటంటే.. నాగార్జున సాగర్ కూడా జోన్-2 పరిధిలోనే ఉంది.
ఇక విశాఖపట్నం, విజయవాడ గురించి చూద్దాం. విశాఖ కూడా జోన్-2లోనే ఉంది. అంటే.. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో విశాఖలోనూ అలాగే ఉంటుంది. భూకంపాలు వచ్చినా వచ్చినట్టు తెలీదంతే. కాకపోతే.. సముద్రగర్భంలో భారీ భూకంపం పుడితే మాత్రం.. సునామీ విరుచుకుపడొచ్చు. అదొక్క ప్రమాదం అయితే ఉంది. ఇక విజయవాడ. హైదరాబాద్, విశాఖ కంటే కాస్త డేంజర్ జోన్‌లో ఉన్నది విజయవాడనే. ఇది జోన్-3లో ఉంది. అంటే తక్కువ స్థాయి భూకంపాలు వస్తాయన్న మాట. ఈ జోన్‌లో విజయవాడతో పాటు మచిలీపట్నం, నెల్లూరు ఏరియాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈ జోన్-3లో ఉన్న ప్రాంతాలన్నీ గోదావరి నదీతీరంలో ఉన్నాయి. ఇక జోన్-4 ఏరియాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. బొగ్గు గనులు ఉన్నటువంటి కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి వంటి ప్రాంతాలు.. కాస్త డేంజర్‌లో ఉన్నాయి.
ములుగులో వచ్చింది జస్ట్ 5.3 మాగ్నిట్యూడ్ మాత్రమేగా అనుకోవద్దు. ఎందుకంటే.. 1963 ఫిబ్రవరి 9న కశ్మీర్‌లో 5.3 తీవ్రత భూకంపం వచ్చినందుకే 80 మంది చనిపోయారు. మనదేశంలో 5.3 నుంచి అత్యధికంగా 8.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 2001 జనవరి 26న గుజరాత్‌లోని భుజ్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఏరియాలో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 20వేల మంది చనిపోయారు. మనదేశంలో భూకంపం సృష్టించిన విపత్తుల్లో ఇదే అతిపెద్దది. 1993 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని లాతూరులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 11వేల మంది చనిపోయారు. 1991 అక్టోబర్ 19న చమోలీ, ఉత్తరకాశీ, ఢిల్లీ, చండీఘడ్‌లో 7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 2వేల మంది చనిపోయారు. మనదేశంలో హైయెస్ట్ భూకంపం తీవ్రత 1950 ఆగస్ట్ 15న వచ్చింది. ఆరోజు 8.6 తీవ్రతతో ఇండో-చైనా సరిహద్దులో భూకంపం వచ్చింది. ఆ సమయంలో 1530 మంది చనిపోయారు.
సరే.. భూకంపం వస్తున్నట్టు మనకు ముందుగా తెలుస్తుందా? ఇప్పటి వరకైతే అలాంటి టెక్నాలజీ లేదు. అదే ఉండి ఉంటే వేల ప్రాణాలను రక్షించుకునే వాళ్లం. కాకపోతే.. ప్రకృతి కొన్ని సంకేతాలు పంపిస్తుంది అంటున్నారు. సపోజ్.. ములుగు భూకంపాన్నే తీసుకుందాం. ఇది ఇక్కడితో ఆగదు అంటున్నారు సైంటిస్టులు. మరోసారి కూడా భూకంపం వచ్చే ప్రమాదం ఉందనే చెబుతున్నారు. కారణం.. భూమి లోపల పొరలు సర్దుకునే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, భూమి కంపిస్తూనే పోతుంది. లాతూర్‌లో సైతం ఇలాంటి సంకేతాలే కనిపించాయంటున్నారు. 1993లో మహారాష్ట్రలోని లాతూరులో వచ్చిన భూకంపానికి 11వేల మంది చనిపోయారు. ఈ ప్రకృతి విపత్తుకు ఆరు నెలల ముందు తరచుగా చిన్నచిన్న భూకంపాలు, భూప్రకంపనలు సంభవించాయి. అంటే.. భూమి లోపల ఏదో సర్దుబాటు జరుగుతోందన్న మాట. సెప్టెంబర్ 29, 1993న భూమి పొరల్లో పెద్ద సర్దుబాటే జరిగినట్టుంది. ఆ కారణంగానే.. తెల్లవారుజామున వచ్చిన ఆ ఘోరకలికి లాతూరులో ఏకంగా 11వేల మంది చనిపోయారు.
ఫైనల్‌గా.. ములుగులో మనం చూసింది జస్ట్ ఒక సిగ్నల్, ఒక ట్రైలర్ మాత్రమేనా అంటే.. ఏమో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇది కూడా ఒక సంకేతంగానే భావించాలేమో. పైగా ములుగు పరిసర ప్రాంతాల్లో, గోదావరి నదిపై పెరుగుతున్న ప్రాజెక్టులు, బొగ్గు గనుల కారణంగా.. భూకంప తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఏదేమైనా.. హైదరాబాద్, విశాఖ మాత్రం సేఫ్. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు తప్ప తెలుగు రాష్ట్రాలు కూడా సేఫ్.