ఏపీలో దట్టమైన మేఘాలు అంతటా ఉంటాయి. ఇవాళ ఒకట్రెండు చోట్ల జల్లులు తప్పితే.. భారీ వర్షం పడే అవకాశం లేదు. ఐతే.. ప్రస్తుతం జార్ఖండ్‌పై ఉన్న అల్పపీడనం.. మన తెలుగు రాష్ట్రాలవైపు పయనిస్తే.. అప్పుడు ఉత్తరాంధ్రలో జల్లులు పడే అవకాశాలు పెరుగుతాయి.
ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఉంది. అలాగే దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
మరోవైపు అరేబియా సముద్ర ప్రాంతం నుంచి గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని.. గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడన ప్రాంతం మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తులో మరొక ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. ఈరోజు(గురువారం) తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.