జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ఎపిసోడ్ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల క్రితం సెటిల్‌మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు రాజకీయం చేయడం వైసీపీకే దక్కిందన్నారు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలి వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న లక్ష్మీ గత 4 రోజులుగా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారన్నారు కిరణ్.
కిరణ్ రాయల్‌పై వస్తోన్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అధినేత పవన్ కళ్యాణ్. విచారణ పూర్తయ్యేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. జనసేన నేత కిరణ్‌రాయల్‌ను నమ్మి మోసపోయానంటూ లక్ష్మీ అనే మహిళ మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ అందులో ఉంది.
కిరణ్.. లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్లిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇంటి లోపలకు వెళ్తున్న దృశ్యాలు, బయటకు వస్తున్న దృశ్యాలు క్లియర్ కట్‌గా ఉన్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణల వెనుక వైసీపీ ఉందని ఆరోపిస్తున్నారు కిరణ్ రాయల్. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.