2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 18, ఏప్రిల్ 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్షకు సంబంధించిన పరీక్ష మాత్రం జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తవగా అడ్మిట్ కార్డులు సైతం విడుదలయాయి. విద్యార్ధుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాలతోపాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. పరీక్ష రెండు విడతలుగా నిర్వహించినప్పటికీ వీటన్నింటిలో ఆరో తరగతి ప్రవేశాలు మాత్రం ఒకేసారి జరుగుతాయి.
ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులోనూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో పెన్ను – పేపర్ విధానంలో 2 గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. ప్రతి నవోదయ విద్యాసంస్థలో 80 చొప్పున సీట్లు ఉంటాయి. ప్రవేశ పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్ధులు ఎవరైనా వీటిల్లో సీట్లు పొందవచ్చు. Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST) 2025 మొత్తం 120 మార్కులకు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ విభాగంలో 40 ప్రశ్నలకు 50 మార్కులకు, అర్థమెటిక్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు, ల్యాంగ్వేజ్ టెస్ట్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 వరకు నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి ఉంటుంది. నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి, 11వ తరగతుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.