రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మాట్లాడారు.. మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్‌రావు, అలాగే.. సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదంటూ వ్యాఖ్యానించారు. హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అంటూ పేర్కొన్నారు. ట్రబుల్ క్రియేట్ చేసేదీ ఆయనే.. సాల్వ్ చేసినట్టు చెప్పుకునేదీ ఆయనే.. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు అంటూ కవిత పేర్కొన్నారు. ఆరడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది, తర్వాత మీవంతే.. అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కవిత పేర్కొన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఓటమికి హరీష్ కారణమని కవిత ఆరోపించారు. సంతోష్‌రావుకు ధనదాహం చాలా ఎక్కువ.. నేరెళ్ల దళితులను సంతోష్‌రావు ఇబ్బందిపెట్టారు.. కాంగ్రెస్‌తో హరీష్, సంతోష్ గ్యాంగులు కుమ్మక్కయ్యాయంటూ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీష్, సంతోష్ ఇద్దరూ మేకవన్నె పులులంటూ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు అంతా.. పార్టీ వీడి వెళ్లిపోయింది హరీష్‌రావు వల్లే అంటూ కవిత ఆరోపించారు. రేవంత్‌కు హరీష్ సరెండర్ అయ్యాకే తనపై కుట్రలు జరిగాయని..హరీష్‌రావు, రేవంత్ మ్యాచ్‌ఫిక్సింగ్ కళ్లముందు కనిపిస్తోందన్నారు.
నేను ఏ పార్టీలో చేరడం లేదు..
తాను ఏ పార్టీలో చేరడం లేదని.. కవిత స్పష్టంచేశారు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని కవిత పేర్కొన్నారు.