టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం కాక రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్‌కుమార్‌గౌడ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి.
ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు.. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేశ్‌కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసుల విచారణకు కూడా హాజరై సహకరించామని తెలిపారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిగా గాలికి వదిలేసి ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోవని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు కేటీఆర్. స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని.. కానీ.. ఇలాంటి కేసులతో ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీ.పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చేసే వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ లాంటివారిని కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా అటెన్షన్ డైవర్షన్ డ్రామాలను పక్కన బెట్టి.. పరిపాలనపై దృష్టి పెట్టి, ప్రజలకు మంచి చేసే అంశాలపై ఫోకస్ చేయాలని కేటీఆర్ హితవు పలికారు.