తెలంగాణ రాజకీయాలకు చిట్‌చాట్ మంటలు అంటుకున్నాయి. గంజాయ్ బ్యాచ్ అంటూ అధికారపక్షం విపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే… డైవర్ట్ రాజకీయాలు అస్సలొద్దు. దమ్ముంటే నిరూపించూ అంటూ విపక్షం అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. అసలే తెలంగాణ రాజకీయాలు బనకచర్ల ఇష్యూతో భగభగ మండుతున్నాయి. ఇప్పుడు అగ్నికి ఆజ్యం అన్నట్లుగా చిట్‌చాట్ చిటపటలు కూడా అంటుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ ను గంజాయి బ్యాచ్‌తో పోల్చడంతో వివాదం రాజుకుంది.
కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్‌లో డ్రగ్స్ తీసుకొని చనిపోయాడని, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను కూడా తెప్పించినట్లు రేవంత్ చెప్పడంతో తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేగింది. అంతేకాదు లోకేష్‌ను KTR ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలన్నారు రేవంత్. అర్ధరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్‌లు ఎందుకు చేశారని సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు రేవంత్
మరోవైపు రేవంత్ రెడ్డి చిట్ చాట్ మాటలపై బీఆర్ఎస్ మండిపడింది. గంజాయి బ్యాచ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సవాల్ విసిరారు కేటీఆర్. డ్రగ్స్ కేసులు ఉంటే చూపించాలని, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమన్నారు కేటీఆర్. గతంలోతాను చేసిన వైట్ చాలెంజ్‌కు..రేవంతే పారిపోయాడని… అసత్య ఆరోపణలతో రేవంత్ ప్రజాసమస్యలను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్
మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి చిట్‌చాట్ వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్ బూతులతో ఢిల్లీ కాలుష్యం పెరిగిందని, కేటీఆర్ రాష్ట్ర గౌరవాన్ని అంతర్జాతీయంగా పెంచితే..సీఎం రేవంత్ బ్యాగ్‌లు మోసి తెలంగాణ పరువు తీసారంటూ విమర్శించారు. రేవంత్‌కు కంపల్సివ్ లై సిండ్రోమ్ ఉందని, రహస్య మంతనాలు రేవంత్‌కే సాధ్యమని విమర్శించారు. రేవంత్ బనకచర్లపై అడ్డంగా దొరికిపోయాడని, చర్చ జరిగిందని కేంద్ర మంత్రి నిమ్మల చెబుతుంటే… రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు హరీశ్.
రేవంత్ రెడ్డి చిట్‌చాట్ మంటలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మరింత హీటెక్కించాయి. కేటీఆర్, లోకేష్ రహస్య సమావేశాల ఆరోపణలు బీఆర్ఎస్, టీడీపీ మధ్య సంబంధాలను హైలెట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా… బనకచర్లపై తెలంగాణ సమాజాన్ని రేవంత్ తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ రివర్స్ అటాక్‌కు దిగుతోంది. మొత్తానికి చిట్‌చాట్ రగడ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది.