చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారు
తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి మీద మరొక్కరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదం ముగియక ముందే మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని లేఖలో ఆయన విమర్శించారు. సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్థిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందన్నారు. చేతకాని, మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది రాహుల్ చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతోందని, ఎన్నికల టైంలో ఊరురా తిరిగి ఊదరగొట్టిన గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని మండిపడ్డారు.
డిక్లరేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు.. కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్‌లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని పేర్కొన్నారు. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాదిపాటు పత్తా లేకుండా పోయిన రాహుల్‌కి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయిందని విమర్శించారు. ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం రాహుల్ కన్నెత్తి చూడకపోవడంతో నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై రాహుల్‌కి ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఇచ్చిన మాటపై లేదన్నారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చమని, తప్ప పేర్లు మార్చలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా ? అని ఘాటుగా లేఖ రాశారు
రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాయడంపై టీకాంగ్రెస్ ఎంపీలు నిప్పులు చెరిగారు. ఓర్వలేకే రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విషం కక్కుతున్నారని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాహుల్‌గాంధీకి తెలుసన్నారు. మరో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్‌లు కూడా కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.