ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని ఇటీవలే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏసీబీ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరుకాగా ఏసీబీ ఆయనను 8గంటల పాటు ప్రశ్నించింది. అయితే ఈ విచారణ సందర్భంగా అధికారులు కేటీఆర్ ఫోన్ పరిశీలించాలని అడగ్గా ఆయన.. ఫోన్ తీసుకురాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఫార్ములా ఈ- కారు రేసు సమయంలో 2021 – 24 మధ్య వాడిన మొబైల్‌ను ఈ నెల 18లోపు సబ్మిట్ చేయాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై ఏసీబీ అధికారులకు సమాధానం ఇస్తూ కేటీఆర్ తాజాగా ఓ లేఖ రాశారు.
విచారణ తర్వాత ఏసీబీ అధికారులు తాను నవంబర్ 1, 2021, డిసెంబర్ 1, 2023 మధ్య ఉపయోగించిన మొబైల్ ఫోన్‌తో పాటు, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఐప్యాడ్ మొదలైన ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించాలని BNSS సెక్షన్ 94 కింద తనకు మరో నోటీసు అందజేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. అయితే, BNSS సెక్షన్ 94 కింద జారీ చేసిన నోటీసులో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కోరడానికి గల కారణం లేదా ఉద్దేశ్యాన్ని పేర్కొనలేదని, దర్యాప్తుకు అవి ఎందుకు అవసరమో వివరించలేదని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అన్ని అధికారిక రికార్డులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఆ శాఖ మంత్రిగా తన అధికారిక హోదాలో తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఆరోపణలలో గతంలో ఉపయోగించిన వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, వాటిని సమర్పించాలని డిమాండ్ చేయడం రాజ్యాంగం ప్రకారం పౌరుడికి మంజూరు చేయబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా దర్యాప్తునకు అటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరమని ఎక్కడా నిర్ధారించబడలేదని ఆయన ఎత్తి చూపారు.
ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించాలంటే, డేటాను ట్యాంపరింగ్ చేయడం లేదా దుర్వినియోగం చేయకుండా ఉండటానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన కఠినమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కెటిఆర్ తెలిపారు. చెల్లుబాటు అయ్యే, స్పష్టమైన కారణం లేకుండా ఎవరూ పరికరాలను సమర్పించమని బలవంతం చేయరాదని ఆయన పేర్కొన్నారు. ఇక 2024 తర్వాత తన మొబైల్ ఫోన్‌ను మార్చుకున్నానని, ప్రస్తుతం పాత ఫోన్‌ను తన వద్ద లేడని ఆయన లేఖలో పేర్కొన్నారు.