తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి హరీష్ రావు కారణమని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, కేటీఆర్ హరీష్ రావును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ BRS పెట్టిన పోస్ట్‌ను కేటీఆర్ రీ పోస్ట్ చేశారు.
నీటిపారుదల గురించి కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఒక్కరే క్లాస్ పీకారంటూ ఓ వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆరు అడుగుల బుల్లెట్టు అంటూ హరీష్ రావును అభినందిస్తూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన కవిత.. హరీష్ రావు, సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం విషయంలో వాళ్లు చేసిన ఘనకార్యాల వల్లే కేసీఆర్ బద్నాం అవుతున్నారని, ఆయనపై సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత ఆగ్రహంగా మాట్లాడారు. తన తండ్రిపై ఎంక్వైరీ వేస్తే తనకు కోపం, ఆవేదన ఉండదా అంటూ కవిత ప్రశ్నించారు.