హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు.
జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు రోజులు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జులై 26వ తేదీన కుషాయిగూడలో మిస్సింగ్ కేసు నమోదైంది. సైనిక్ పూరిలో RD Pro ఈవేంట్స్ నిర్వహిస్తున్న దుర్గ ప్రసాద్.. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరోవైపు కనిపించకుండా పోయిన దుర్గా ప్రసాద్ చెరువులో శవమై తేలడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడిది ఆత్మహత్య కాదని ఎవరో చంపి ఉంటారని పోలీసులకు విన్నవించారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.