హైదరాబాద్ శివారులో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందనే భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలో మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలటరీ ఏరియాలోకి వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్ లోకి చిరుత వెళ్లినట్లు ట్రాక్ కెమారాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
చిరుత సంచరిస్తుండడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగి గూడ, గంధంగూడ, నెక్నామ్ పూర్, ఇబ్రహీంబాగ్, రాందేవ్ గూడ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అయితే.. చిరుతను బంధించేందుకు బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు అటవీశాఖ అధికారులు. అటవీ ప్రాంతంలో తప్ప జనావాసాల్లోకి చిరుత రావడం లేదని.. చెప్పారు. చిరుతపై నిఘా ఉంచామని, స్పెషల్ టీమ్స్ చిరుత కోసం వెతుకుతున్నాయని చెబుతున్నారు.
జూలై 24న గండిపేట గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో చిరుత కనిపించింది. అంతకుముందు 11న బాలాపూర్ డిఫెన్స్ లేబొరెటరీస్‌లో రెండు చిరుతలు కనిపించాయి. హైదరాబాద్ శివారుల్లో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు.. బెంబేలెత్తిస్తున్నాయి. పైగా.. అన్నీ కేంద్ర ప్రభుత్వ సారథ్యంలో నడిచే డిఫెన్స్ సంబంధిత సంస్థల్లోనో, ఆ సమీపంలోనో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది.
సోమవారం గోల్కొండలోని మిలటరీ క్యాంప్ దగ్గర ఇబ్రహీంబాగ్‌లో రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. బైక్‌పై ఓ వెళ్తున్న ఓ వ్యక్తి దాన్ని గుర్తించి అటవీశాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఏరియా పబ్లిక్‌లో వణుకుమొదలైంది. 20రోజులుగా శివారుల్లో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. నాలుగురోజుల క్రితం గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌లో ఓ చిరుత కనిపించింది. దాన్ని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు పెట్టినా ఇంతవరకూ దాని జాడ లేదు. ఇప్పుడు గోల్కొండలో కనిపించిన చిరుత అదేనా, ఇది వేరేనా.. అన్నది తేలాల్సి ఉంది.
ఇక ఈ నెల 11న బాలాపూర్‌లోని APJ కలాం డిఫెన్స్ లేబొరెటొరీస్ రీసెర్చ్ సెంటర్‌లో ఒకటి కాదు.. రెండు చిరుతలు కనిపించాయి. ఈ ప్రాంతాలన్నీ రక్షణరంగానికి సంబంధించిన ప్రాంతాలు. సహజంగా అక్కడ ఎక్కువగా అటవీస్థలం ఉంటుంది. కాబట్టి.. 60కిలోమీటర్ల రేంజ్‌లో సంచరించే చిరుతలు ఒకటీ రెండేనా.. ఇంకా ఉన్నాయా అన్న భయంతో పబ్లిక్ వణికిపోతున్నారు.