టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది.
తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. దేవుని మహిమ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. డి ఆర్ మహల్ ఎదురుగా ఉన్న గాంధీ పురంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. రోజూలాగే గురువారం కూడా భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి 8:30 గంటల సమయంలో శివలింగంపై కళ్ళు ఏర్పడినట్లు గుర్తించారు. ఇంకేముంది ఈ వార్త క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ అద్భుత దృశ్యం వీక్షించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్ధరాత్రి వరకూ భక్తులు ఆలయంలోనే స్వామివారిని చూస్తూ పూజలు చేస్తుడిపోయారు. శివలింగం కళ్ళు తెరిచినట్లు తాము గుర్తించామని భక్తులు చెబుతున్నారు.
ఈ క్రమంలో డీఆర్ మహల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు శివలింగంపై హఠాత్తుగా ఏర్పడిన కళ్ల దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. శ్రావణమాసం శుభవేళ ఇదంతా పరమేశ్వరుని మహత్యమే అంటున్నారు.