రెప్పపాటు జననం..రెప్పపాటు మరణం అన్నారు పెద్దలు.. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతోన్న మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండానే అకాల మరణాలు జరుగుతున్నాయి. చిన్నారులు, కాయ కష్టం చేసుకునే కస్టజీవులు సైతం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో మరణిస్తున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్‌పేట జంక్షన్ వద్ద డ్రైవింగ్ చేస్తూ గుండె పోటుతో లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే డ్రైవర్ మృతితో లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై భారీ విధ్వంసాన్ని సృష్టించింది. తమిళనాడు నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్‌కు కొబ్బరి బొండాల లోడ్‌తో లారీ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ ఫరీద్‌పేట జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ షేక్ ఫరీద్‌కి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో షేక్ ఫరీద్ లారీ డ్రైవింగ్ సీట్‌లోనే కుప్పకూలిపోయాడు.లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న ఐరన్ రైలింగ్ ఢీకొట్టి సర్వీసు రోడ్డులోకి దూసుకుపోయింది. అక్కడి నుంచి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే లారీ ముందు వీల్ బరస్ట్ అయ్యి వీల్ ఊడిపోయింది. తరవాత ఎలక్ట్రిక్ స్తంభాన్ని అనుకుని ఉన్న గుంతలో ముందుభాగం దిగిపోయి లారీ నిలిచిపోయింది.
ప్రమాదం జరిగే సమయంలో లారీలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. షేక్ ఫరీద్‌తో పాటు రసూల్ అనే మరో డ్రైవర్ కూడా ఉన్నాడు. సరిగ్గా ప్రమాదానికి గంట ముందే రసూల్ క్యాబిన్లో నిద్రించేందుకు ఉపక్రమించగా ఫరీద్ డ్రైవింగ్ చేయటం మొదలు పెట్టాడు. మృతుడు షేక్ ఫరీద్ తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని జిన్నానగర్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా మరో లారీ డ్రైవర్ రసూల్ ఎలాంటి గాయాల్లేకుండానే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదంపై ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ ఫరీద్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్‌కి తరలించారు.