వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.?
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందట. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు రాగల రెండు మూడు గంటలలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురవనుండగా.. హైదరాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.