జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మే 1 నుండి అమలు కానుంది. అయితే, అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తుల పేర్లను గమనిస్తే.. ముందు ఆ వ్యక్తి పేరు (First Name), తర్వాత ఇంటి పేరు (Surname) లేదా తండ్రి పేరు కనిపిస్తుంది. అంతర్జాతీయ ట్రావెల్ డాక్యుమెంట్ పాస్‌పోర్టులోనూ ఇదే ఫార్మాట్ ఉంటుంది. భారతదేశంలో వ్యక్తుల పేర్ల విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం కనిపిస్తుంది. ఇంటి పేరు కొన్ని రాష్ట్రాల్లో ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో అసలే లేదు. కొన్ని రాష్ట్రాల్లో వ్యక్తి పేరు తర్వాత తండ్రి పేరు రాస్తే.. ఉత్తరాదిన వ్యక్తి పేరు, ఆ వ్యక్తి సామాజికవర్గాన్ని తెలిపే పేరు చివరన ఉంటుంది. ‘బ్రాహ్మణులు’ పేరు చివర శాస్త్రి, శర్మ, ద్వివేది, త్రివేది, చతుర్వేది, మిశ్రా, పాండే వంటి పేర్లను తగిలిస్తుంటే, ‘క్షత్రియ’ – ‘రాజ్‌పుత్’ వర్గాలు ఠాకూర్, సింగ్ వంటి పేర్లను, ‘వైశ్యులు’ అగర్వాల్, గుప్తా వంటి పేర్లను తమ పేరు చివర తగిలిస్తూ ఉంటారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముందు ఇంటి పేరు, తర్వాత వ్యక్తి పేరు రాస్తుంటారు. కొందరు వ్యక్తి పేరు తర్వాత కులాన్ని వ్యక్త పరిచే పేర్లు ‘రెడ్డి’, ‘చౌదరి’, ‘నాయుడు’, ‘రాయుడు’, ‘శర్మ’, ‘శాస్త్రి’, ‘రావు’ వంటి పదాలను కూడా చేర్చుతుంటారు. పేర్లు రాసే విధానం ఎలా ఉన్నా.. అధికారికంగా మాత్రం ముందు వ్యక్తి పేరు (కులాన్ని వ్యక్తపరిచే పేరుతో సహా), తర్వాత ఇంటి పేరు ఉంటే దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ వంటి ప్రఖ్యాత క్రీడాకారుల పేర్లను గమనిస్తే.. వారి పేరు చివర ఉన్న ‘కోహ్లీ’, ‘ధోనీ’, ‘టెండూల్కర్’ వంటివి ఇంటి పేర్లని అర్థమవుతుంది.
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వ్యక్తి పేరు తర్వాత తండ్రి పేరును కూడా కలిపే పేర్కొంటారు. ఉదాహరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరునే తీసుకుంటే అధికారిక రికార్డుల్లో “నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ” అని కనిపిస్తుంది. ఇందులో ఆయన పేరు ‘నరేంద్ర’ అయితే, ‘దామోదర్ దాస్’ ఆయన తండ్రి పేరు. ‘మోదీ’ అనేది ఆయన ఇంటి పేరు. ఇదే రాష్ట్రానికి చెందిన మహాత్మ గాంధీ పేరును గమనించినా ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. “మోహన్ దాస్ కరమ్‍చంద్ గాంధీ” ఆయన పూర్తి పేరు. ఇందులో ‘మోహన్ దాస్’ ఆయన పేరు కాగా, ‘కరమ్‌చంద్’ ఆయన తండ్రి పేరు. ‘గాంధీ’ వారి ఇంటి పేరు. మహారాష్ట్రలోనూ పేరుకు, ఇంటిపేరుకు మధ్య తండ్రి పేరు పెట్టుకోవడం కనిపిస్తుంది. తమిళనాడు, దక్షిణ కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇంటి పేరు లేకున్నా వ్యక్తి పేరు, తర్వాత తండ్రి పేరు రాస్తుంటారు. నిర్మల ‘సీతారామన్’, కీర్తి ‘సురేశ్’ వంటి పేర్లే ఇందుకు ఉదాహరణ.
తల్లి పేరును తప్పనిసరి చేస్తూ…
కానీ మహారాష్ట్ర ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి వ్యక్తి పేరుతో పాటు తల్లి పేరును రాయడం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం 2024 మే 1 తర్వాత పుట్టిన పిల్లలకు ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో నమోదు చేయించే పేరులో తల్లి పేరును చేర్చాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రంలో వ్యక్తి పేరుతో పాటు తండ్రి పేరు, ఆ తర్వాత ఇంటి పేరును రాస్తుంటారు. ఇప్పుడు తల్లి పేరు కూడా చేర్చడంతో వ్యక్తి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, ఆ తర్వాత ఇంటి పేరు రాయాల్సి ఉంటుంది. ఈ విధానం గురించి ప్రచారం చేయడం కోసం కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్, మరికొందరు మంత్రులు తమ పేర్లలో తల్లి పేరును చేర్చుకుని ప్రమాణ స్వీకారాలు చేశారు. నేమ్‌ప్లేట్లను ఆ మేరకు మార్పించారు. సీఎం పేరు దేవేంద్ర సరిత గంగాధర రావు ఫడ్నవీస్ గా మారింది. ఇక్కడ ఆయన అసలు పేరు దేవేంద్ర. ఆ తర్వాత వచ్చిన సరిత తల్లి పేరు కాగా, గంగాధర రావు తండ్రి పేరు, ఫడ్నవీస్ ఇంటి పేరు. ఇదే మాదిరిగా ఏక్‌నాథ్ షిండే కూడా తల్లి పేరును చేర్చుకుని ఏక్‌నాథ్ గంగూబాయి శంభాజీ షిండేగా మార్చుకున్నారు. ఆయన తల్లి పేరు గంగూబాయి, తండ్రి పేరు శంభాజీ, ఇంటి పేరు షిండే అని అర్థమవుతుంది.
చరిత్రలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరు అందరూ వినే ఉంటారు. ఆయన పేరు శాతకర్ణి కాగా గౌతమి ఆయన తల్లి పేరు. తల్లి పేరు తెలిసేలా అప్పట్లో ఈ విధానం అనుసరించారు. ఆ వ్యక్తి ఎదిగి ఎంత గొప్పవాడైనా అందుకు కారణమైన తల్లికి గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసి కనడం ఒకెత్తయితే, ఆ తర్వాత పెంచి, పెద్ద చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లి పాత్ర ఎనలేనిది. అలాంటి తల్లి లేకుండా బిడ్డ లేడు. న్యాయ విద్యార్థికి సంబంధించిన ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు కూడా తల్లి పేరును విద్యార్థులకు సంబంధించిన అన్ని పత్రాల్లో తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది.
గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో లా చదువుకున్న ఓ విద్యార్థిని డిగ్రీ పట్టా తీసుకున్న తర్వాత అందులో కేవలం తండ్రి పేరు మాత్రమే ఉండడాన్ని గమనించింది. డిగ్రీ పట్టాలో తన పేరు, తల్లి పేరు, తండ్రి పేరు ఉండేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది. ఆమె అభ్యర్థన సామాజిక ప్రాధాన్యత కలిగిన అంశమని అభిప్రాయపడ్డ హైకోర్టు.. విద్యార్థులకు సంబంధించిన అన్ని పత్రాల్లో విద్యార్థి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉండాలని సూచించింది. అయితే డాక్యుమెంట్లలో విడిగా మరో కాలమ్‌లో తల్లి పేరు పెట్టకుండా, పేరులోనే కలిపేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యావద్దేశం దృష్టిని ఆకట్టుకుంది.