హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.హెచ్‌సీఏ కేసులో ఐదుగురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనుంది సీఐడీ. నిందితులను ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ క్లబ్స్‌లో అవకతవకలు, గత హెచ్‌సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది సీఐడీ. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, హెచ్‌సీఏ సీఈవో సునీల్, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్‌ను విచారించనుంది సీఐడీ. ఈ ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన మల్కాజ్‌గిరి కోర్టు… ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్‌గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు, దర్యాప్తు వేగవంతం కావాలని సూచించింది. నిందితులను గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు.
ఇప్పటికే నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో ఏర్పాటు చేసిన క్లబ్ ద్వారానే HCAలో అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టు సీఐడీ గుర్తించింది. దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం హెచ్‌సీఏ… ఇప్పుడు అవినీతికి కేరాప్‌గా మారింది. అక్కడ జరుగుతున్న ఆటంతా అవినీతి ఇన్నింగ్సే. సొమ్మును తెగతినడంలో ఆరితేరిపోయారు. బీసీసీఐ నుంచి అప్పనంగా వచ్చిపడుతున్న కోట్లు… హెచ్‌సీఏ పెద్దల జేబుల్లోకి వెళ్తున్నాయ్ తప్ప ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయ్. ఈ మొత్తం అవినీతిపై సీఐడీ ఫోకస్ పెట్టింది. కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలస్తోంది.