కన్నప్పగా మంచు విష్ణు ఎంతవరకు మెప్పించారు..?

సినిమా చరిత్రలో కొన్నిటిని క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం. అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓ సారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్‌స్టార్‌ కెరీర్‌లో కలికితురాయి ఈ మూవీ. అలాంటి సబ్జెక్టును యంగ్‌ రెబల్‌ స్టార్‌ వదులుకుంటారా? అనే ప్రశ్నలన్నటినీ దాటి.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌ మీద సరికొత్తగా ల్యాండ్‌ అయింది. ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్‌ పాత్ర పొందిగ్గా కుదిరిందా? అతిథులందరూ ఫైనల్‌ కట్‌ చూసుకుని ఆనందంగానే ఉన్నారా? ఆలస్యమెందుకు చదివేయండి..

నటీనటులు: విష్ణు మంచు, అవ్రామ్‌ భక్త మంచు, మోహన్‌బాబు, బ్రహ్మానందం, శరత్‌కుమార్‌, ముఖేష్‌ రుషి, బ్రహ్మాజీ, శివబాలాజీ, రఘుబాబు, సప్తగిరి దేవ్‌రాజ్‌, లవి పజ్ని, అర్పిత్‌ రాంక, సంపత్‌ రామ్‌, మధుబాల, ఐశ్వర్య, ప్రీతీ ముకుందన్‌,, సురేఖా వాణి తదితరులు

అతిథిపాత్రలు: ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, కాజల్‌ తదితరులు

దర్శకత్వం: ముఖేష్‌ కుమార్‌ సింగ్‌

కథ – స్క్రీన్‌ప్లే: విష్ణు మంచు

నిర్మాత: మంచు మోహన్‌బాబు

కెమెరా: షెల్డన్‌ ఛౌ

ఎడిటింగ్‌: ఆంటోనీ

సంగీతం: స్టీఫెన్‌ డేవ్సీ

నిర్మాణం: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

విడుదల: జూన్‌ 27, 2025

చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు తిన్నడు (అవ్రామ్‌). తండ్రి నాదనాథుడు (శరత్‌కుమార్‌) కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. వారున్న గూడేనికి నాదనాథుడే నాయకుడు. అమ్మవారికి నరబలి ఇచ్చే ఆచారం ఉంటుంది. ఓ సారి తిన్నడి స్నేహితుడు బలి అవుతాడు. అప్పటి నుంచీ దేవుడు లేడని నాస్తికత్వాన్ని పెంచుకుంటాడు తిన్నడు. ప్రతి విషయాన్నీ తర్కిస్తుంటాడు. వీరిలాంటి గూడేలు చుట్టుపక్కల మరో నాలుగు ఉంటాయి. ఐదు గూడేలు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండవు. కానీ అక్కడికి దగ్గరలో వాయు లింగం ఉంటుంది. దాన్ని పెకలించుకుని పోవడానికి కాలముఖుడు దండయాత్ర చేస్తాడు. ఆ సమయంలో ఐదు గూడేల వాళ్లూ చేతులు కలుపుతారు. ఆ క్రమంలో జరిగిన మాటల్లోనే తిన్నడిని నాయకుడిగా ఎన్నుకుంటారు. పన్నగ గూడేనికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్‌)ని తిన్నడు ఇష్టపడతాడు. వారిద్దరి ప్రేమ కారణంగా ఐదు గూడేల మధ్య కలహాలు ఏర్పడతాయి. ప్రజల శ్రేయస్సు కోసం తిన్నడిని తన స్థావరం నుంచి బహిష్కరిస్తాడు తండ్రి నాదనాథుడు. తండ్రి మాటను పాలించిన తిన్నడు బయటికెళ్తాడు. అతనితోనే ఉంటానంటూ నెమలి కూడా తన స్థావరం నుంచి వెళ్తుంది. తిన్నడు నాస్తికుడైతే, నెమలికి శివుడే అన్నీ. తల్లిని, కుటుంబాన్ని వదిలి వచ్చిన నెమలి.. ఒకానొక సమయంలో శివుడి కోసం తిన్నడితో గొడవ పడుతుంది. మహాశివరాత్రి వేళ వారి మధ్య జరిగిన చర్చ ఎటు దారితీసింది? తిన్నడి జీవితంలో ఆ రోజు జరిగిన విశేషం ఏంటి? అతన్ని దారిలో పెట్టడానికి రుద్రుడు ఏం చేశాడు? సాక్షాత్తూ పరమశివుడిని(అక్షయ్‌కుమార్‌) పార్వతీదేవి(కాజల్‌) ఏం కోరింది? వాయులింగాన్ని సంరక్షించిన అగస్త్య వంశ మహదేవశాస్త్రి (మంచు మోహన్‌బాబు) కళ్లారా చూసిన విశేషం ఏంటి? అసలు తిన్నడు.. కన్నప్పగా ఎందుకు మారాడు? శ్రీ, కాళ, హస్తిని సినిమాలో ఎలా చూపించారు? ఏ సందర్భంలో ఎస్టాబ్లిష్‌ చేశారు? ఇలాంటి చాలా చాలా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్వర్ణముఖి సాక్షిగా జరిగిన కథను ఈ కన్నప్పలో ఎలా చూపించారో థియేటర్లలో తెలుసుకోవాల్సిందే.

‘ఇప్పటిదాకా ఇది నా కన్నప్ప.. ఇప్పటి నుంచీ మీ కన్నప్ప కథ’ అంటూ సినిమా రిలీజ్‌ టైమ్‌లో ట్వీట్‌ చేశారు మంచు విష్ణు. సినిమా మొదటి నుంచీ ఆఖరి వరకు విష్ణు కేరక్టర్‌కి మంచి మార్కులే పడుతున్నాయి. తిన్నడిగా ఆయన వేషధారణ, నటనకు మంచి మార్కులే వేయాలి. నెమలి కేరక్టర్‌లో ప్రీతి చక్కగా నటించారు ప్రధాన పాత్రధారులందరూ వారికి కేటాయించిన పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి పాత్రనూ ఎలివేట్‌ చేశారు డైరక్టర్‌. ఏదో పేరుకి సినిమాలో పాత్రలు అన్నట్టు కాకుండా, ప్రతి పాత్రకూ ప్రాముఖ్యతనిచ్చినట్టు అర్థమవుతుంది. సినిమా ప్రారంభంలో పాటలో విష్ణు కుమార్తెలు కనిపించారు. బాల తిన్నడిగా అవ్రామ్‌ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

కిరాతార్జునీయంలోని ఘటనలను కన్నప్ప కథలో పొందుపరిచిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. అర్జునుడిని పరీక్షించడానికి వచ్చిన కిరాత పాత్రలో మోహన్‌లాల్‌ నటన బావుంది. సినిమా మొదలైనప్పటి నుంచీ శివపార్వతులుగా అక్షయ్‌కుమార్‌, కాజల్‌ అలరించారు. బాల తిన్నడు తన చుట్టూ తిరుగుతున్న సమయంలో అక్షయ్‌కుమార్‌ అతని వెనక పారవశ్యంతో అడుగులు వేసిన సన్నివేశానికి థియేటర్లలో చప్పట్లు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి.

రుద్ర కేరక్టర్‌లో ప్రభాస్‌ ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఇష్టంగా ఎదురుచూశారు అభిమానులు. ఏ చిన్న సస్పెన్స్ రివీల్‌ అయినా.. అది ప్రభాస్‌ కోసమే అన్నట్టు ఎదురుచూశారు అభిమానులు. ఎవరెంత ఎదురుచూసినా, సెకండ్‌ హాఫ్‌లోనే వస్తారు ప్రభాస్‌. రుద్ర కేరక్టర్‌లో… ఏక సమయంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, అక్షయ్‌కుమార్‌, ప్రీతితో అతనికున్న సన్నివేశాలు మెప్పిస్తాయి. ప్రభాస్‌ కనిపించిన 25 నిమిషాలూ స్క్రీన్‌ చకచకా కదిలిపోతుంది. ప్రతి షాట్‌నీ ప్రేక్షకులూ ఇష్టంగా చూస్తుండటం అర్థమైపోతుంది. సెటిల్డ్ గా, సరదాగా ప్రభాస్‌ చేసిన యాక్టింగ్‌ ఆకట్టుకుంటుంది. మహదేవశాస్త్రిగా పరుషంగా కనిపించారు మోహన్‌బాబు. ఆఖరికి తిన్నడి భక్తిని చూసి పులకించి భక్తి పారవశ్యంలో మునిగినప్పుడు ఆయనలో కరుణ, దయ, భక్తి కనిపిస్తాయి. మహదేవశాస్త్రి పాత్రకు ప్రాణం పోశారు మోహన్‌బాబు.

సినిమాలో అన్నీ ఉన్నా.. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది. తీసింది కాళహస్తి చరిత్ర. కన్నప్ప కథ అయినప్పుడు.. ఎక్కడా రాయలసీమ యాస కనిపించదు. లొకేషన్స్ కూడా మనకు దగ్గరగా అనిపించవు. నది, అడవి, పరిసరాలు.. వేటికీ అంత తొందరగా కనెక్ట్ కాలేం. సినిమాలో చాలా పాత్రలు తెలుగు మాట్లాడుతుంటే మనవాళ్లు కాదు.. మన కథ కాదు అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సన్నివేశాల్లో ఉన్న గాఢత నేపథ్య సంగీతంలో కనిపించలేదు. పాటలు కూడా మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు. వీఎఫ్ఎక్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల తేలిపోయినట్టు అనిపించింది.

గతంలో మనవాళ్లు చూసిన కన్నప్ప కథ కాదు ఇది. ఇప్పటితరానికి తగ్గట్టు తిన్నడి జీవితాన్ని మరింత విస్తరించి, కాస్త లోతుగా విశ్లేషించి, మరికొన్ని కల్పనలను జోడించి, అసలైన ఎపిసోడ్‌ తో కలిపి నయా కన్నప్ప కథగా అందించారు విష్ణు. స్వర్ణముఖీ నదీ తీరాన జరిగిన శ్రీకాళహస్తి కథను ఈ తరానికి అందించే ప్రయత్నంలో విష్ణు ఎంత వరకు సక్సెస్‌ అయ్యారు. నయా భక్త కన్నప్పగా విష్ణు అలరించారా? తెలుసుకోవాలంటే ఓసారి థియేటర్లకు వెళ్లి రావాల్సిందే!

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *