పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో వెలుగు చూసింది…
సీబీఎస్సీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను చుట్టముట్టారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖాధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు.
సీబీఎస్‌ఈ రీజనల్ కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్ పంపగా.. స్కూల్‌లోని ఓ ఉద్యోగి సంతకంపెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధ్రువీకరించింది. అయితే స్కూల్‌కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపై స్పష్టత కరువైంది. దీంతో గత 2, 3 నెలలు స్కూల్ చుట్టూ తిరుగుతుంటే.. విద్యార్ధులకు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్ గల్లంతైనాయని దాటవేస్తున్నారే తప్ప, ఎప్పుడిస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంకెప్పుడు ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలని, మార్కుల మెమోల ఒరిజినల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన మండల విద్యాశాఖాధికారులు.. పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్టులో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియడం లేదనీ, మరోమారు పంపించమని సీబీఎస్‌ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డీఈవో శాంతకుమారి తెలిపారు.ఈ స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్ల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈవో శాంతకుమారి వివరించారు.