యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ యోగాసనాలు ప్రదర్శించారు.
స్థానిక వాసులు రెండు కాళ్ళు లేని దివ్యాంగుడు రాము, టీ కొట్టు నడుపుకుంటున్న 53 ఏళ్ల లలిత, 7 ఏళ్ల చిన్నారి నిత్యశ్రీ ప్రియ నీటిలో పలు ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధమైన జల యోగాసనాలను ఎక్కడా వేయలేదని, దీన్ని అరుదైన కార్యక్రమంగా గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసి అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను ప్రతినిధి శంకరాచారి అందించారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయింది. యోగాసనాలు వేసే సమయంలో నీటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చుట్టూతా గజ ఈతగాళ్లతో కూడిన పడవలను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది.