ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, సామాజిక సర్వే తదితర అంశాలపై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు, సీఎస్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి 500 మందికి ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలన్నారు.
సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాక పోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ముందు రోజు రాత్రే ప్రజలకు సమచారం ఇవ్వాలని.. స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. దరఖాస్తూల విషయంలో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్‌లు సమీక్షించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియని.. ఈఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్లు కలెక్టర్లకు మంత్రి పొంగులేని సూచించారు.