భవిష్యత్తు అవసరాల కోసం కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికి వస్తాయని చిట్టీలు వేస్తారు. కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ వ్యాపారి బిచానా ఎత్తివేశాడు. చిట్టీల పేరుతో నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి బురిడి కొట్టించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కాలనీకి చెందిన కటకం సైదిరెడ్డి నివాసమున్నాడు. తన మంచి మాటలతో కాలనీవాసులందరినీ పరిచయం చేసుకున్నాడు. కాలనీ వాసులందరికీ తలలో నాలుకలా ఉంటూ చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. కాలనీలోనీ వ్యాపారులు, ఉద్యోగ కుటుంబాల నుండి పెద్ద మొత్తంలో చిట్టీలు వేయించుకున్నాడు. మొదట్లో చిట్టి పాడిన సభ్యులకు సకాలంలోనే డబ్బులు చెల్లించేవాడు. ఇలా అందరితో మంచి వ్యాపారిగా నమ్మించాడు. ఇలా సమీప కాలనీల నుంచి కూడా చిట్టీలు వేయించుకున్నాడు. ఇదే కాలనీకి చెందిన శ్రావణి అనే మహిళ ఐదు లక్షల చిట్టిని కడుతోంది. తన కుటుంబ అవసరాల కోసం ఐదు లక్షల రూపాయల చిట్టిని ఎత్తుకుంది. ఏజెంటు కమీషన్ మినహా మిగతా డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. రేపు మాపు అంటూ పది రోజులుగా తిప్పుతున్నాడు. చిట్టిల వ్యాపారి సైదిరెడ్డికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.
దీంతో ఆ మహిళ చిట్టి డబ్బుల కోసం చిట్టీల వ్యాపారి సైదిరెడ్డి ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో షాక్ తిన్నది. వారం రోజులుగా సైదిరెడ్డి కనిపించడం లేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. మోసపోయమని గ్రహించిన బాధితురాలు శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. చిట్టీల వ్యాపారి సైదిరెడ్డి నాలుగు కోట్ల రూపాయల వరకు చిట్టీ డబ్బులతో ఉడాయించినట్లు బాధితులు లబోదిబోమన్నారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు చిట్టీల వ్యాపారి సైదిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపారు.