గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా రంగంలోకి దిగి గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పట్టించారు. కాలేజ్ పరిసరాల్లో మహిళలు, చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు తెలపడంతో ఆమె పోలీసులతో కలిసి గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రాంతంలో కలకలం రేపగా, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
వాళ్లంతా చెట్టు కింద కూర్చున్నారు. ఏదో సరదా కూర్చున్నారా అంటే అదేం కాదు.. ముచ్చట్లు చెప్పుకుంటూ ఏకంగా గంజాయి సేవిస్తున్నారు. మరో ప్రపంచంలో తేలియాడుతున్నారు. అదే క్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మరో ముగ్గురితో కలిసి వారున్న చోటుకే వచ్చింది. దీంతో ముగ్గురు యువకులు ఖంగుతిన్నారు. గల్లా మాధవితో పాటు వచ్చిన ముగ్గురులో పోలీసులున్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఒక కాలేజ్ వద్ద జరిగింది. ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగి గంజాయి సేవించే వారిని పోలీసులుకు పట్టించడం కలకలం రేపింది.
అంతకముందు ఏం జరిగిందంటే… ఎమ్మెల్యే గల్లా మాధవి క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా కాలేజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో మహిళలు ముందుకొచ్చి గంజాయి సేవించి ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. కాలేజ్ పరిసర ప్రాంతాలను అడ్డగా మార్చుకొని గంజాయి సేవిస్తున్నారని అదే దారిలో వస్తున్న మహిళలు, చిన్నారులను ఇబ్బంది పెడుతున్నారని ఆమెతో చెప్పారు. దీంతో ఆమె వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులతో కలిసి గాలించారు. ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తూ వారి కంట పడ్డారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
గుంటూరు వెస్ట్ పరిధిలో రెగ్యులర్ గా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని మాధవి సూచించారు. గంజాయి సేవించే అలవాటు ఉన్నవారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. గంజాయి సేవిస్తున్న వారితో పాటు విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అమ్మకందార్లను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసలు డ్రోన్ల సాయంతో నిఘా పెట్టినప్పటికీ గంజాయి సేవిస్తున్న వాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.