IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ- రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే.. Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాదు.. సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటూ శత్రువైఖరిని ప్రదర్శిస్తున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉండగా.. భారత్ 4.5 జనరేషన్ యుద్ధ విమానమైనా రఫేల్‌ను సమకూర్చుకోడానికి చాలా వ్యయ,ప్రయాసలకు గురికావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో భారత్ సైతం 5వ తరం ఫైటర్ జెట్లను సమకూర్చుకోవడమే కాదు.. వాటిని భారత్‌లోనే తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చేలా, భారత్–రష్యా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందానికి లైన్ క్లియర్ అయింది. ఇందులో భాగంగా రష్యా, భారత్‌కు ఆధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ముందుకొచ్చింది. వాటిలో Su-57E ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్‌లోనే తయారుచేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయనుండగా, Su-35M అనే 4.5 తరం ఎయిర్ సుపీరియారిటీ అత్యాధునిక యుద్ధవిమానాలను వెంటనే పంపించేందుకు రష్యా సిద్ధంగా ఉంది.
Su-57E – భారతదేశంలో తయారీకి మార్గం సుగమం..
రష్యా ప్రభుత్వ రంగ సంస్థ Rostec, విమాన తయారీ దిగ్గజం Sukhoi ఈ ప్రతిపాదనను ఇటీవల భారత ప్రభుత్వానికి అందించాయి. ఇందులో Su-57E (5వ తరం స్టెల్త్ యుద్ధవిమానం) పూర్తి టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేయనున్నారు. ఈ విమానాల తయారీ HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) నాసిక్ ప్లాంట్‌లో జరగనుంది. ఇదే ప్లాంట్ ఇప్పటికే 220 కంటే ఎక్కువ Su-30MKI యుద్ధవిమానాలను తయారు చేసింది. మొదట 20-30 Su-57E జెట్లను రష్యాలోనే తయారు చేసి భారత్‌కు అందజేసిన అనంతరం.. 3-4 సంవత్సరాల్లో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా 2030 నాటికి 60-70 కొత్త స్టెల్త్ ఫైటర్లు భారత వాయుసేనలో చేరే అవకాశం ఉంది.
నేరుగా భారత్‌కు రెడీమేడ్ Su-35M జెట్లు..
IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ- రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే.. Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది. దీంతో పైలట్లకు, గ్రౌండ్ సిబ్బందికి పెద్దగా అదనపు శిక్షణ అవసరం ఉండదు.
అత్యాధునిక ఇంజిన్లు – Su-30MKIకు అప్‌గ్రేడ్ అవకాశాలు..
ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు కొత్త AL-41F1S, Izdeliye 177S ఇంజిన్లను కూడా అందించనున్నారు. ఇవి Su-30MKIలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ ఇంజిన్లు ఎక్కువ శక్తివంతమైనవి, మన్నికైనవి కూడా.
సాంకేతికంగా స్వావలంబన..
Su-57E ఎగుమతి వర్షన్‌లో భారత్‌కు పూర్తి సోర్స్ కోడ్ యాక్సెస్ ఇవ్వనున్నారు. HAL నాసిక్ ప్లాంట్‌లో 40-60% వరకూ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు అనుమతి ఉంటుంది. భారత్ అభివృద్ధి చేసిన Astra BVR, Rudram వంటి క్షిపణులు, Virupaksha AESA రాడార్‌లను ఇందులో అమర్చే అవకాశం ఉంటుంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకాల ప్రోత్సాహానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, భారతదేశ స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.
సరసమైన ధరలో Su-35M..
Su-35M ధర 65–80 మిలియన్ డాలర్ల మధ్య ఉండగా, Rafale ధర దాదాపు 120 మిలియన్ డాలర్లు. ఈ రెండూ 4.5 తరానికి చెందిన యుద్ధ విమానాలే. రఫేల్‌ను రష్యా నుంచి కొనుగోలు చేస్తుండగా.. భారత్ చిరకాల మిత్రదేశం రష్యా Su-35M లను రఫేల్‌తో పోల్చితే దాదాపు సగం ధరకే అందించనుంది. అమెరికన్ ఫైటర్ జెట్ F-35A కూడా 80–100 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. అంటే Su-35M ఇతర యుద్ధవిమానాల కంటే తక్కువ ఖర్చుతో లభిస్తుంది. Su-35Mలో హైపర్‌సోనిక్ R-37M మిసైల్ (400 కిమీ శక్తి) మరియు K-77M వంటి శక్తివంతమైన ఆయుధాలు అమర్చవచ్చు. ఇవి హిమాలయ ప్రాంతాల్లో లేదా పాకిస్తాన్ ఉపయోగిస్తున్న చైనా మేడ్ J-10C, భవిష్యత్తులో అందించనున్న J-35 వంటి యుద్ధ విమానాలపై ఆధిక్యం చూపేలా చేస్తాయి.
అమెరికా ప్రతిబంధకాలు – ఒక సవాలు
అమెరికా Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) చట్టం ప్రకారం, రష్యాతో పెద్దఎత్తున రక్షణ ఒప్పందాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. గతంలో S-400 మిసైల్ డీల్ సమయంలో ఇదే జరిగింది. పైగా, కొన్ని పరికరాల సరఫరాలో రష్యా నుంచి ఆలస్యం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Rafaleపై ప్రభావం ఉంటుందా?
Rafale ఇప్పటికే 36 యుద్ధవిమానాలతో IAFలో ఉన్నప్పటికీ, దాని ధర ఎక్కువ. కానీ అది నమ్మదగినది. ఇక Su-35M తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో పాటు, అధిక శక్తితో కూడిన ఆయుధాలను తీసుకురావచ్చు. ఇది IAFకు మంచి ఎంపికగా మారవచ్చు. ఈ డీల్ జరిగితే, భారత్‌లోనే 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానాలు తయారు అవుతాయి. దీని వల్ల స్వదేశీ తయారీకి ఊతం లభిస్తుంది. Su-30MKIలకు కూడా శక్తివంతమైన ఇంజిన్లు అమర్చడం ద్వారా అవి 2055 వరకూ సేవలందించగలవు. IAFకు కావాల్సిన 42 స్క్వాడ్రన్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఒప్పందం ఒక కీలక అడుగుగా మారనుంది. భవిష్యత్తు భారత రక్షణ వ్యవస్థలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలవనుంది.